హీరోయిన్ గారి డైరెక్షన్

నటులు దర్శకులు కావడం తక్కువే. ఒకవేళ వాళ్లు మెగా ఫోన్ పట్టినా సక్సెస్ అయినవాళ్లు మరీ తక్కువ. ఇక హీరోయిన్లు దర్శకత్వం చేపట్టడం అన్నది మరీ అరుదైన విషయం. విజయ నిర్మల లాంటి వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టాల్సిందే. ఐతే పాత్రల ఎంపికలో తమదైన ప్రత్యేకత చూపించే, సినిమాల గురించి లోతుగా మాట్లాడే కొందరు హీరోయిన్లను చూస్తే వాళ్లు దర్శకత్వం చేస్తామంటే నమ్మబుద్ధేస్తుంది.

నిత్యా మీనన్ అలాంటి కోవకే చెందుతుంది. తాను డైరెక్షన్ చేస్తానని ఆమె ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మలయాళ భామ నివేథా థామస్ సైతం ఇదే మాట అంటోంది. తాను కచ్చితంగా భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఐతే ఆ మాట ఏమీ ఆషామాషీగా చెప్పట్లేదు నివేథా.

దర్శకత్వం చేయాలన్న తన కోరిక ఇప్పటిది కాదని.. చాలా ఏళ్ల ముందే ఈ లక్ష్యం పెట్టుకున్నానని.. అందుకోసమే డైరెక్షన్ కోర్సులో కూడా జాయిన్ అయ్యానని.. ఆ కోర్సు కూడా పూర్తయిందని నివేథా చెప్పింది. ఐతే నేరుగా సినిమాల్లోకి వెళ్లకుండా.. ముందు షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్న ఆలోచనతో ఉన్నానని.. వాటితో అనుభవం సంపాదించాక సినిమాలు తీసే ప్రయత్నం చేస్తానని నివేథా చెప్పింది.

ఇటీవలే ‘వకీల్ సాబ్’లో పల్లవి పాత్రతో నివేథా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆమె బాలనటిగా మలయాళంలో గుర్తింపు తెచ్చుకుని.. తర్వాత హీరోయిన్ అయింది. నివేథా ఏ పాత్ర చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే ప్రేక్షకులకు కలిగించింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగులోనూ ఆమె చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసింది. నిన్నుకోరి, 118, బ్రోచేవారెవరురా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది నివేథా.