చిన్న సినిమాల జాతర షురూ కానుందా..?


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ కూడా హోల్డ్ లో పెట్టారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లకు కూడా పర్మిషన్లు దొరకడం లేదు. జూన్ రెండో వారం నుండి షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ రెండో వారానికి లాక్ డౌన్ లో సడలింపులు వస్తాయని భావిస్తున్నారు. ఆ విధంగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా ప్యాచ్ వర్క్ లు, గ్రాఫిక్స్ వర్క్, పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సినిమాలు ఆ పనులన్నీ చక చకా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. 


ఆ విధంగా చూసుకుంటే లిస్ట్ పెద్దదనే చెప్పాలి. కానీ థియేటర్లు ఆగస్టులో తెరుచుకుంటాయని అంటున్నారు. సమయం ఉంది కాబట్టి మరికొన్ని సినిమాలు ఆగస్టు నాటికి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు మొత్తం కలిపి ఇరవై నుండి ముప్పై వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ కూడా ఆగస్టుకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సినిమా టికెట్ రేట్లు, యాభై శాతం ఆక్యుపెన్సీ ఓకే అనుకునేవారు మాత్రమే తమ సినిమాలను రిలీజ్ చేసే సాహసం చేస్తారు. లేదంటే మళ్లీ హోల్డ్ లో పెట్టేస్తారు. 


కరోనా ఫస్ట్ వేవ్ పూర్తయిన తరువాత సినిమాలన్నీ ఒకేసారి థియేటర్లలో సందడి చేశాయి. వారానికి నాలుగు నుండి ఆరు చొప్పున సినిమాలు రిలీజ్ అయ్యేవి. సక్సెస్ రేటు తక్కువే ఉన్నప్పటికీ చిన్న నిర్మాతలంతా పోటీ పడి మరీ తమ సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా అలానే జరిగే ఛాన్స్ ఉంది. ఒక్కసారి థియేటర్లు గనుక తెరుచుకుంటే చిన్న సినిమాల జాతర షురూ అవ్వడం ఖాయం. కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.