కేరళ సీఎంకు జగన్ స్ఫూర్తి?

కరోనా టైంలో గొప్ప పనితీరును ప్రదర్శించిన ప్రభుత్వాల్లో కేరళలో పినరపి విజయన్ సర్కారును ముందు వరుసలో నిలపాల్సిందే. మిగతా రాష్ట్రాల మాదిరి కరోనా కేసులు, మరణాల్ని తక్కువ చేసి చూపించడం.. తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారాలు చేసుకోవడం.. అత్యవసర వైద్య సదుపాయాల విషయంలో చేతులెత్తేయడం.. లాంటివి కేరళలో లేవు. కరోనాకు సంబంధించి దేశం మొత్తంలో అత్యంత పారదర్శకంగా, ఎంతో చురుగ్గా వ్యవహరించిన ప్రభుత్వంగా విజయన్ సర్కారుకు ప్రశంసలు దక్కాయి.

ఇటీవలే ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయన్.. మరింత ఉత్సాహంగా పని చేస్తూ ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. తాజాగా ఆయన ప్రకటించిన పథకాన్ని అందరూ అభినందిస్తున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు.

ఇందులో భాగంగా వెంటనే ఆ పిల్లలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. అలాగే నెలకు రూ.2 వేల ఆర్థిక సాయాన్ని కూడా ఇస్తారు. ఇది ఆ పిల్లలు మేజర్ అయ్యే వరకు, అంటే 18వ పుట్టిన రోజు జరుపుకునే వరకు కొనసాగుతుంది. అలాగే డిగ్రీ వరకు ఈ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకాన్ని ప్రకటించగానే చాలామందికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చారు. ఆయన స్ఫూర్తితోనే విజయన్ ఈ పథకం ప్రకటించారంటున్నారు.

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు అందజేయనున్నట్లు జగన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఏపీ సీఎం ప్రకటన ఏ మేరకు అమలుకు నోచుకుందో.. ఇందులో ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నారో తెలియదు. గతంలో జగన్ ఇలా కొన్ని విషయాల్లో ఘనంగా ప్రకటనలు చేసి అమలులో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. కానీ కేరళ ప్రజల్లో విద్యాధికత వల్ల రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. కాబట్టి అక్కడ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధినేతలు ఒక ప్రకటన చేస్తే దానికి నూటికి నూరుశాతం కట్టుబడాల్సిందే. ఏం చేసినా పారదర్శకతో చేయాల్సిందే. కాబట్టి విజయన్ ప్రకటించిన పథకం.. బాధిత పిల్లలకు గొప్ప ఊరట అవుతుందనడంలో సందేహం లేదు.