‘భరత్ అను నేను’లో పెద్ద సర్ప్రైజ్

‘భరత్ అను నేను’లో పెద్ద సర్ప్రైజ్

‘స్పైడర్’ అయిపోగానే.. గ్యాప్ తీసుకోకుండా ‘భరత్ అను నేను’ మీదికి వెళ్లిపోయాడు మహేష్ బాబు. ఈ సినిమా ఇప్పటికే రెండో షెడ్యూల్లో ఉంది. మహేష్ నిర్విరామంగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాడు కొరటాల శివ.

ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని ఇతర ముఖ్య పాత్రల గురించి పెద్దగా సమాచారం బయటికి రాలేదు. ఐతే ‘భరత్ అను నేను’లో మహేష్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో మహేష్ తండ్రి.. సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారట. ఆయనది క్యామియో రోల్ అని.. ఐతే అది కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ చిన్నతనంలో కృష్ణతో కలిసి చాలా సినిమాలు చేశాడు. ఐతే అతను హీరో అయ్యాక కూడా రాజకుమారుడు.. వంశీ లాంటి సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు.

ఐతే మహేష్ స్టార్ ఇమేజ్ సంపాదించాక తండ్రితో కలిసి నటించనే లేదు. కృష్ణ గత కొన్నేళ్లుగా సినిమాలు బాగా తగ్గించేశారు. గత ఏడాది ‘శ్రీ శ్రీ’ అనే సినిమాలో కనిపించాక మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. మరి తండ్రీ కొడుకులు కలిసి మళ్లీ నిజంగానే నటించి.. అభిమానుల్ని మురిపిస్తారేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు