తెలుగులో ఢాం.. మరి తమిళంలో?

తెలుగులో ఢాం.. మరి తమిళంలో?

ఎప్పుడూ తమిళ సినిమాలు వచ్చి తెలుగులో వసూళ్లు కొల్లగొట్టడమే తప్ప.. మన సినిమాలు వెళ్లి తమిళంలో ఆడటం అరుదు. ఐతే ఈ విషయంలో తెలుగు సినిమాల్ని మరీ తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఒకప్పుడు మన సినిమాలు కూడా తమిళంలో ఇరగాడేసిన చరిత్ర ఉంది. ‘శంకరాభరణం’ అక్కడ అసాధారణంగా ఆడేసింది. ఆ తర్వాత ఆ స్థాయి విజయం సాధించిన సినిమాల్లో ‘అన్నమయ్య’ ఒకటి. ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు అప్పట్లో బ్రహ్మరథం పట్టారు. మళ్లీ ఏ తెలుగు సినిమా కూడా ఆ స్థాయిలో తమిళంలో ఆడింది లేదు. ఇప్పుడు మరో భక్తిరస చిత్రం తమిళంలోకి వెళ్తోంది. అదే.. నమో వేంకటేశాయ.

‘అన్నమయ్య’ చేసిన నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లోనే తెరకెక్కిన ‘ఓం నమో వేంకటేశాయ’ను త్వరలోనే తమిళంలో విడుదల చేయబోతున్నారట. ఐతే ‘అన్నమయ్య’.. ‘శ్రీరామదాసు’ తరహాలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోస్తుందని.. వాళ్లను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుందని ఆశించిన ‘ఓం నమో..’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని పరాభవాన్ని ఎదుర్కొంది. రూ.40 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం వసూలు చేసింది మాత్రం రూ.10 కోట్లే. నాగార్జున కెరీర్లోనే పెద్ద డిజాస్టర్లో ఒకటిగా నిలిచిందీ సినిమా.

ఈ దెబ్బతో రాఘవేంద్రరావు తీవ్రంగా కలత చెంది ఇక సినిమాలు పూర్తిగా మానేద్దామనే వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. ఐతే ఈ సినిమా చెత్తా అంటే అదేమీ లేదు. చాలా మంచి రివ్యూలు వచ్చాయి. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ చేయడం, సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం ప్రతికూలమైంది. మరి తమిళంలో ఈ సినిమాకు ఎలాంటి ఫలితం దక్కుతుందో.. ‘అన్నమయ్య’ మ్యాజిక్‌ను ఈ సినిమా రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు