‘స్పైడర్’ గురించి విలన్ ముచ్చట్లు

‘స్పైడర్’ గురించి విలన్ ముచ్చట్లు

మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’లో దర్శకుడు ఎస్.జె.సూర్య మెయిన్ విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ‘టీజర్’ టీజర్లో మహేష్ తర్వాత ఎక్కువ హైలైట్ అయింది అతడే. ఐతే ఈ చిత్రంలో ఇంకో విలన్ కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. అతనే.. భరత్. ‘ప్రేమిస్తే’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భరత్.. ఆ తర్వాత అడ్రస్ లేడు.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘స్పైడర్’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ సందర్భంగా ‘స్పైడర్’ గురించి ఒక ఇంటర్వ్యూలో భరత్ ఆసక్తికర విశేషాలు చెప్పాడు.

‘‘నేనో సినిమా షూటింగులో ఉండగా మురుగదాస్ సార్ ఫోన్ చేశారు. మహేష్ బాబుకు దీటుగా ఉండే విలన్ పాత్ర కోసం చూస్తున్నానని.. చేస్తావా అని అడిగారు. ఆ పాత్ర గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాను. నేను స్వతహాగా హీరో పాత్రలు చేస్తున్నప్పటికీ మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో సినిమా కావడం.. పాత్ర బాగుండటంతో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నా. ‘ప్రేమిస్తే’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నప్పటికీ అది డబ్బింగ్ సినిమా. మహేష్ సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడం నా అదృష్టం.మహేష్ బాబు నుంచి చాలా నేర్చుకున్నాను. అంత స్టార్ హీరో అయి ఉండి కూడా ఆయన ఎదుటి వారికిచ్చే గౌరవం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు సహనం చాలా ఎక్కువ. ‘స్పైడర్’ సినిమాను రెండు భాషల్లో చిత్రీకరించారు. ప్రతి సన్నివేశం రెండుసార్లు చేయాలి. కొన్నిసార్లు రీటేక్స్ ఉంటాయి. అయినా చాలా కూల్‌గా ఉండేవాడు. మహేష్ తమిళం స్పష్టంగా మాట్లాడతాడు. నాకు తెలుగు సరిగా రాదు. నేను కొన్ని డైలాగుల విషయంలో చాలా ఇబ్బంది పడి ఎక్కువ టేక్స్ తీసుకునేవాడిని. అయినా మహేష్ ఓపిక పట్టేవాడు. నాకు.. మహేష్‌కు మధ్య వచ్చే సన్నివేశాల్ని 25 రోజుల్లో చిత్రీకరించారు. మురుగదాస్ స్క్రీన్ ప్లే విషయంలో మాస్టర్. ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ల చరిత్రలో ‘స్పైడర్’ బెస్ట్ మూవీ అవుతుంది. ‘స్పైడర్’ స్పెషల్ మూవీ కాబట్టి విలన్ పాత్ర చేస్తా. దీని తర్వాత మాత్రం మళ్లీ నెగెటివ్ రోల్ చేయను’’ అని భరత్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు