హిందీ ‘టెంపర్’ ఫిక్సయిందిగా..

హిందీ ‘టెంపర్’ ఫిక్సయిందిగా..

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ‘టెంపర్’. రెండున్నరేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌కు మళ్లీ ఊపిరినిచ్చింది. ఈ సినిమాపై ఇతర భాషల వాళ్లూ ఆసక్తి చూపించారు. రీమేక్ కోసం ఎగబడ్డారు. తమిళంలో విశాల్ హీరోగా ఈ రీమేక్‌కు సన్నాహాలు జరిగాయి. కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు.

మరోవైపు ‘టెంపర్’ హిందీ రీమేక్ గురించి చాన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. కానీ సినిమా అయితే ఖరారవ్వలేదు. ఎట్టకేలకు ‘టెంపర్’ హిందీ రీమేక్ ఓకే అయింది. అనుకున్న కాంబినేషన్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది.

పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్లోకి అడుగుపెట్టి.. వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించిన రణ్వీర్ సింగ్ ‘టెంపర్’ హిందీ రీమేక్‌లో హీరోగా నటించనున్నాడు. యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్లు తీయడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం రణ్వీర్.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావతి’ చేస్తున్నాడు.

రోహిత్ శెట్టి ‘గోల్ మాల్’ సిరీస్‌లో కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్లు ఆ కమిట్మెంట్లు పూర్తి చేయగానే ‘టెంపర్’ రీమేక్ పట్టాలెక్కుతుంది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దీన్ని మార్చి తీయబోతున్నారట. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు.

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించిన దయా పాత్రలో రణ్వీర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు