నాని సినిమా.. పర్మిషన్ లేదు

నాని సినిమా.. పర్మిషన్ లేదు

తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి. ఆ సినిమా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. ఐతే రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మాత్రం రెండు విధాలా ఆకట్టుకుంది. కొత్తగా ఉంటూనే.. కమర్షియల్‌గానూ సక్సెస్ అయింది. ఇప్పుడు నితిన్‌తో ‘లై’ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హను. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే హను రెండు సినిమాలు కమిటై ఉండటం విశేషం. అందులో ఒకటి హను రెండో సినిమా హీరో నానితో కావడం విశేషం. ఈ సినిమాకు కథ కూడా సిద్ధంగా ఉందట. కానీ లొకేషన్ సమస్య వల్ల ఇప్పుడే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడటం కుదరట్లేదట.

నానితో తీయబోయేది ఒక ఆర్మీ కుర్రాడి ప్రేమకథ అని చెప్పాడు హను. ఆ సినిమాను చాలా వరకు లడఖ్ ప్రాంతంలో చిత్రీకరించాల్సి ఉందని.. కానీ పర్మిషన్ల కోసం అడిగితే.. ఇప్పుడు కుదరదని అధికారులు తేల్చేశారని హను తెలిపాడు. వచ్చే ఏడాది మే తర్వాతే పర్మిషన్ ఇస్తామన్నారని.. దీంతో నాని వేరే సినిమా చేసుకుంటున్నాడని హను తెలిపాడు. అంత వరకు ఖాళీ ఉండలేను కాబట్టి వేరే సినిమా చేద్దామని చూస్తున్నట్లు తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా.. ఇందులో హీరో ఎవరు అనేది చెబుతానన్నాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తర్వాత అఖిల్‌తో సినిమా చర్చలు జరగడం గురించి అడగ్గా.. ఆ కథ బాగా వచ్చిందని.. వేరే కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయామని.. భవిష్యత్తులో చేసే అవకాశాలున్నాయని చెప్పాడు. మరి అఖిల్ ఇంకో రెండు నెలల్లో ఖాళీ అయిపోతాడని వార్తలొస్తున్న నేపథ్యంలో తనతోనే సినిమా చేసినా చేయొచ్చేమో హను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు