శేఖ‌ర్ క‌మ్ముల‌కు చేతులెత్తి మొక్కాలి

లాక్ డౌన్ టైంలో ఎవ‌రి క‌ష్టాలు వాళ్ల‌వి. త‌ట్టా బుట్టా చేత‌బ‌ట్టి, పిల్ల‌ల్ని వెంట బెట్టుకుని వంద‌ల కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న ప్ర‌యాణం చేస్తున్న వ‌ల‌స కార్మికుల దైన్యాన్ని చూస్తున్నాం. సమాజంలో ఇలాంటి అభాగ్యులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ల‌లో ఎవ్వ‌రికీ ప‌ట్ట‌ని హిజ్రాలు కూడా ఉన్నారు. వారికి ఉద్యోగాలుండ‌వు. ప‌నులు దొర‌క‌డ‌మూ క‌ష్టం. ఆధార్ కార్డులు, రేష‌న్ కార్డులూ ఉండ‌వు. మామూలు రోజుల్లో అయితే భిక్షాట‌న చేస్తారు. కొంచెం దౌర్జ‌న్యం చేసి అయినా డ‌బ్బులు తీసుకుంటారు. కానీ ఇప్పుడు అందుకు అవ‌కాశ‌మే లేదు. న‌గ‌రాల్లో వేల మంది హిజ్రాలు తిండికి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వారి మీద ఎవ‌రికీ జాలి ఉండ‌దు. ప్ర‌భుత్వాలు కూడా వారికి సాయం చేయ‌వు. వీరి గురించి ఎవ‌రికీ ప‌ట్ట‌దు.

ఐతే వీరిపై ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల దృష్టి ప‌డింది. ఇప్ప‌టికే హైదరాబాద్ గాంధీ ఆసుప‌త్రి ప‌రిధిలో ప‌ని చేసే వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి శానిటైజేష‌న్ కిట్ల‌తో పాటు ఓ డైరీ సంస్థ సాయంతో నెల రోజుల కింద‌ట్నుంచి రిఫ్రెష్మెంట్స్ అందిస్తూ వారి అభిమానాన్ని చూర‌గొన్నాడు శేఖ‌ర్. అత‌డి సాయానికి వినూత్న రీతిలో కృజ్ఞ‌త‌లు చెప్పిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు శేఖ‌ర్ అండ్ టీం అభాగ్యులైన‌ హిజ్రాల మీద దృష్టిసారించింది. వంద‌ల మంది హిజ్రాల‌కు నిత్యావ‌స‌రాలు స‌ర‌ఫ‌రా చేసింది. ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి వారిని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు శేఖ‌ర్. తిండిలేక ఇబ్బంది ప‌డుతున్న హిజ్రాలు ఎవ‌రైనా కాంటాక్ట్ చేయొచ్చంటూ శేఖ‌ర్ టీం ఫోన్ నంబ‌ర్లు కూడా ఇచ్చింది. సాయం కోరిన వాళ్లంద‌రినీ ఆదుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి వాళ్ల క‌ష్టాల్ని గుర్తించిన శేఖ‌ర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.