చిరు వెర్సస్ పవన్.. నెగ్గేదెవరు?

మొత్తానికి కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలే నిజమయ్యాయి. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి రాదని తేలిపోయింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులై 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. ఆ డేట్‌ అందుకునే దిశగా సరిగ్గానే అడుగులు పడుతుండగా కరోనా మహమ్మారి వచ్చి అడ్డం పడింది.

మళ్లీ ఎప్పుడు చిత్రీకరణ మొదలవుతుందో తెలియదు. లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులున్నాయి. వాటన్నింటినీ అధిగమించి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయడం కష్టం. ఇప్పటికే రాజమౌళి సంక్రాంతి రిలీజ్ డేట్‌ను అందుకోవడంపై సందేహాస్పదంగా మాట్లాడాడు. ఇప్పుడు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ విషయంలో స్పష్టత ఇచ్చేశాడు. సంక్రాంతికి తమ చిత్రం రాకపోవచ్చనే సంకేతాలు ఇచ్చేశాడు.

దీంతో ఇక 2021 సంక్రాంతి ఖాళీని భర్తీ చేసేదెవరన్న చర్చ మొదలైంది. దీనికి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అయితే.. ‘ఆచార్య’నే. ఈ సినిమాను ముందు ఆగస్టు 15కు అనుకున్నారు. తర్వాత దసరా అని వార్తలొచ్చాయి. లాక్ డౌన్ కారణంగా షెడ్యూళ్లన్నీ డిస్టర్బ్ కావడంతో ఇప్పుడు దసరా డేట్ కూడా అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

అప్పటికి థియేటర్లు సాధారణ స్థాయిలో నడుస్తాయో లేదో అన్న సందేహాలూ ఉన్నాయి. కాబట్టి సంక్రాంతికే సినిమాను షెడ్యూల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ సైతం సంక్రాతి రేసులో నిలుస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకో రెండు మూడు వారాలు పని చేస్తే చాలు. పరిస్థితులు బాగు పడితే దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటున్నారు.

కానీ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మళ్లీ చిత్రీకరణ మొదలై.. థియేటర్ల పరిస్థితి, ఆచార్య విషయంలో ఏమనుకుంటున్నారో చూసి నిర్ణయం తీసుకునే అవకాశముంది. సంక్రాంతిని మరే పెద్ద చిత్రం టార్గెట్ చేసే అవకాశాలు లేని నేపథ్యంలో మెగా అన్నదమ్ములిద్దరి చిత్రాల్ని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాల్ని కూడా కొట్టి పారేయలేం. చూద్దాం ఏమవుతుందో?