స‌ల్మాన్ జేబులోకి 110 కోట్లు


రాధె సినిమాకు ఎంత బ్యాడ్ టాక్ వ‌స్తే ఏంటి.. సోష‌ల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఎంత ట్రోలింగ్ జ‌రిగితే ఏంటి.. అంతిమంగా ఈ సినిమా నిర్మాత లాభ‌ప‌డ్డాడా.. న‌ష్ట‌పోయాడా అన్న‌ది కీల‌కం. ఈ విష‌యంలో మేక‌ర్స్ ఫుల్ ఖుషీనే అన్న‌ది ట్రేడ్ వ‌ర్గాల మాట‌. రాధె సినిమాను నిర్మించింది స్వ‌యంగా సల్మాన్ ఖానే. త‌న‌కున్న క్రేజ్‌ను కొన్నేళ్లుగా స‌ల్మాన్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. సొంత సినిమాలే ఎక్కువ చేస్తున్నాడు. రాధె కూడా ఆ కోవ‌లోని సినిమానే. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బ‌డ్జెట్లో పూర్తి చేశార‌ట‌.


థియేట‌ర్ల‌లో రిలీజ్ చేద్దామ‌ని చూసి చూసి, ఇక లాభం లేద‌ని ఇటీవ‌లే జీ వాళ్ల‌కు థియేట్రిక‌ల్, డిజిట‌ల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ క‌లిపి జీ నెట్ వ‌ర్క్ వాళ్ల‌కు ఒకేసారి అమ్మేశారు. అమ్మేశారు. ఈ డీల్ రూ.190 కోట్ల‌కు తెగిన‌ట్లు స‌మాచారం. అంటే స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతానికి రూ.110 కోట్ల లాభం అందుకున్నాడన్న‌మాట‌. త‌క్కువ ఖ‌ర్చులో, త‌క్కువ స‌మ‌యంలో ఓ సినిమా పూర్తి చేసి రూ.110 కోట్లు జేబులో వేసుకున్నాడు స‌ల్మాన్. ఆయ‌న‌కు ఇంత‌కంటే ఏం కావాలి? ఈ సినిమాను కొన్ని జీ నెట్ వ‌ర్క్ వాళ్ల‌కు కూడా బాగానే గిట్టుబాటు అయిన‌ట్లే ఉంది.


జీ నెట్ వ‌ర్క్ వాళ్లు ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో వీలున్నంత మేర సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి థియేట‌ర్లు మూత‌ప‌డి ఉన్న‌ ఇండియాలో ఓటీటీలు, డీటీహెచ్‌ల ద్వారా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఓటీటీలు, డీటీహెచ్‌ల్లో కోటి మందికి పైగానే చూశారు ఇప్ప‌టిదాకా. సినిమాను ఒక‌సారి చూసేందుకు పెట్టిన రేటు రూ.249. ఆ ప్ర‌కారం రూ.250 కోట్ల‌కు పైగానే ఆదాయం వ‌చ్చి ఉంటుంది. ఇంకా జీ ఛానెల్లో సినిమాకు ప్రిమియ‌ర్స్ వేయాల్సి ఉంది. ఆ మార్గంలో కూడా వ‌చ్చే ఆదాయం కూడా క‌లుపుకుంటే జీ వాళ్లు కూడా రూ.100 కోట్ల‌కు త‌క్కువ కాకుండా సంపాదించనున్న‌ట్లే.