‘బిగ్ బాస్’లో అతడి ఓవరాక్షన్‌పై సెటైర్లు

‘బిగ్ బాస్’లో అతడి ఓవరాక్షన్‌పై సెటైర్లు

నిన్నటి తెలుగు ‘బిగ్ బాస్’ ఫస్ట్ షోపై జనాల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్నట్లే ఎన్టీఆర్ తనదైన శైలిలో హుషారెత్తించే వ్యాఖ్యానంతో అదరగొట్టేశాడు. కొన్ని చోట్ల ఎన్టీఆర్ అత్యుత్సాహం విషయమై సెటైర్లు పడ్డప్పటికీ ఓవరాల్‌గా అతడి విషయంలో పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. ఇక పార్టిసిపెంట్ల విషయానికి వస్తే.. అనుకున్నంత స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు జనాల్లో. ఈ షోను రసవత్తరంగా నడిపించేంత స్టామినా వీళ్లకు ఉందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. హిందీ ‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్ల తరహాలో వీళ్లు డ్రామాను నడిపించగలరా.. ఎపిసోడ్లపై ఆసక్తి రేకెత్తించగలరా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఎవరైనా చెప్పారో లేక.. తన ప్లాన్ చేసుకుని వచ్చాడో తెలియదు కానీ.. క్యారెక్టర్ నటుడు సమీర్ తొలి రోజే కొంచెం అతి చేసి వార్తల్లో నిలిచాడు.

సోషల్ మీడియాలో ‘బిగ్ బాస్ తెలుగు’ అనే హ్యాష్ ట్యాగ్ కొట్టి చూస్తే ఎన్టీఆర్ తర్వాత చర్చనీంశమంగా ఉన్నది సమీరే. రెండో పార్టిసిపెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన సమీర్.. అప్పటికే అక్కడ ఉన్న అర్చనను నేరుగా వెళ్లి హత్తుకుని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కూడా హౌస్‌లోకి వచ్చిన ప్రతి అమ్మాయికీ హగ్ ఇచ్చేశాడు. అదే సమయంలో మేల్ పార్టిసిపెంట్లు లోనికి వచ్చినపుడు మాత్రం కామ్‌గా ఉన్నాడు.

సీనియర్ సింగర్ కల్పన ‘బిగ్ బాస్’ స్టేజ్ మీదికి వచ్చినపుడు ఎన్టీఆర్ సైతం ఆమెతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాడు. ఆమె కూడా నమస్తే పెట్టింది తప్ప తారక్‌తో క్లోజ్‌గా మూవ్ కాలేదు. కానీ ఆమె లోపలికి వెళ్లగానే సమీర్ దగ్గరికొచ్చి హగ్ ఇచ్చేశాడు. ఇది చూసిన సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్.. ఎమ్మెస్ నారాయణ ఫ్యామిలీని వాటేసుకునే సీన్.. ఇంకా కొన్ని ఏవో పెట్టి సమీర్‌ను ట్రోల్ చేశారు. మొత్తానికి సమీర్ ఒక ఫ్లర్ట్ అన్న ముద్ర పడిపోయింది. హిందీ.. తమిళ బిగ్ బాస్ షోల్లోనూ ఇలాంటి వాళ్లు ఒకరిద్దరు ఉంటారు. తెలుగు షో నిర్వాహకులు కూడా ఆ పాత్ర సమీర్‌కే ఇచ్చారేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు