కొణిదెల వారబ్బాయి హిట్టు కొడతాడటండీ!

 కొణిదెల వారబ్బాయి హిట్టు కొడతాడటండీ!

హీరోగా పరిచయమై ఇంతకాలం అవుతున్నా ఇప్పటివరకు చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోలేకపోయిన కొణిదెల వరుణ్‌ తేజ్‌ మరోసారి ఈ వారంలో 'ఫిదా'తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకుడు, దిల్‌ రాజు నిర్మాత కావడంతో ఈ చిత్రంపై యువ ప్రేక్షకులతో పాటు ట్రేడ్‌ సర్కిల్స్‌లోను ఆసక్తి నెలకొంది. శుక్రవారం రిలీజ్‌ అవుతోన్న ఫిదాపై ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది.

సినిమాలో చాలా ఆహ్లాదకర సన్నివేశాలున్నాయని, శేఖర్‌ కమ్ముల బ్రాండ్‌ రొమాన్స్‌ ఇష్టపడేవారు ఫిదాకి ఫిదా అవుతారని చెబుతున్నారు. సెన్సార్‌ టాక్‌ కూడా చాలా పాజిటివ్‌గా వినిపిస్తూ వుండడంతో వరుణ్‌ తేజ్‌ని వేధిస్తోన్న సక్సెస్‌ లేని కొరతని ఈ చిత్రం తీరుస్తుందనే భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ టేబుల్‌ వద్ద దిల్‌ రాజు చాలా మార్పులు చేసాడని, ముఖ్యంగా నిడివి బాగా తగ్గించేసాడని, ల్యాగ్‌ అనిపించిన వాటిని అన్నీ తొలగించి స్క్రీన్‌ప్లే స్పీడ్‌గా అనిపించేలా చూసుకున్నాడని సమాచారం.

దిల్‌ రాజు జడ్జిమెంట్‌పై నమ్మకం వున్న కమ్ముల కూడా దేనికీ అడ్డు చెప్పలేదని, ఇప్పటికే పాటలు పాపులర్‌ అవడంతో ఇక సినిమాకి టాక్‌ వస్తే వరుణ్‌ తేజ్‌ కూడా విజయాల బోణీ కొట్టేస్తాడని టాక్‌ వుంది. ఇది ఎంత నిజమనేది తెలియడానికి శుక్రవారం వరకు ఆగాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు