రవితేజ ఉక్కిరి బిక్కిరి

రవితేజ ఉక్కిరి బిక్కిరి

గత కొన్నేళ్లుగా మాస్ రాజా రవితేజ కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగట్లేదు. ఒక్క 'బలుపు' మినహాయిస్తే గత ఐదారేళ్లలో మాస్ రాజాకు సరైన హిట్టు లేదు. ఐతే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒకప్పుడు వరుసగా సినిమాలైనా చేస్తుండేవాడు. ఖాళీ అనేది ఉండేది కాదు. కానీ గత ఏడాది అనుకోకుండా అతడి కెరీర్లో లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అసలు సినిమా అన్నదే లేకుండా గత ఏడాదంతా ఖాళీగా ఉండిపోయాడు మాస్ రాజా.

రవితేజ హీరోగా నిలదొక్కుకున్నాక కెరీర్లో ఎన్నడూ ఇంత గ్యాప్ వచ్చింది లేదు. దాదాపు రెండేళ్ల పాటు రవితేజ సినిమా రిలీజే లేకపోవడంతో జనాలతో డిస్కనెక్ట్ అయిపోయి అతడి ఫాలోయింగ్ బాగా దెబ్బ తినేసే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి సమయంలో  వ్యక్తిగత జీవితంలో వరుస వివాదాలు అతణ్ని మరింత వెనక్కి లాగేస్తున్నాయి.

తన తమ్ముడు భరత్ చనిపోతే కడసారి చూపుకు కూడా వెళ్లకపోవడం.. అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంపై రవితేజ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై అతను ఎంత వివరణ ఇచ్చుకున్నా అది కన్విన్సింగ్‌గా అనిపించలేదు జనాలకు. మీడియా వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉన్నట్లుండి అతను ఎస్కేప్ అవ్వడం సోషల్ మీడియాలో మరింతగా చర్చనీయాంశమైంది. రవితేజ ఇమేజ్‌ను ఆ పరిణామం మరింత డ్యామేజ్ చేసింది. ఇప్పుడు డ్రగ్స్ రాకెట్లో రవితేజ కూడా పాత్రధారి అని.. అతడికి పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం బయటికి రావడంతో షాకవడం అభిమానుల వంతైంది.

అసలే కెరీర్ దెబ్బ తిని.. లేని పోని వివాదాలతో సతమతం అవుతుంటే.. ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం అతడి మెడకు చుట్టుకుంది. దీనిపై ప్రస్తుతం రవితేజ వివరణ ఇచ్చే పరిస్థితుల్లో కూడా కనిపించలేదు. మీడియా ముందుకొస్తే మొన్నట్లాగా ఇబ్బంది పడాల్సి వస్తుందని మాస్ రాజా సైలెంటుగా ఉంటున్నాడట. భరత్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన సమయంలో అతడి ఫోన్ పరిశీలించినపుడే డ్రగ్ రాకెట్ గుట్టంతా బయటపడిందని కూడా ఓ ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం. కాబట్టి రవితేజ ఇప్పుడు మీడియా ముందుకొస్తే ప్రశ్నల వర్షమే కురుస్తుంది అతడిపై. అలాగని తన వెర్షన్ చెప్పకుండా జనాల ఫీలింగ్ మరోలా ఉంటుంది. ఈ నేపథ్యంలో మాస్ రాజా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు