స్పైడర్ రిలీజ్ డేట్.. అఫీషియల్

స్పైడర్ రిలీజ్ డేట్.. అఫీషియల్

తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చింది. ఏ మూలో ఉన్న కొంచెం సందేహాల్ని కూడా తొలగించేస్తూ మహేష్ బాబు కొత్త సినిమా 'స్పైడర్' రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. దసరా కానుకగా సెప్టెంబరు 27న 'స్పైడర్' తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేశారు.

'స్పైడర్' పీఆర్వో బి.ఎ.రాజు ట్విట్టర్లో 'స్పైడర్' రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కాబట్టి 'స్పైడర్' దసరాకు వస్తుందా రాదా అని ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్లు ఇక ఈ చర్చలు కట్టిపెట్టేయొచ్చు. 'స్పైడర్' సంగతి తేలిపోయింది కాబట్టి దసరా సీజన్‌కు షెడ్యూల్ అయి ఉన్న మిగతా రెండు పెద్ద సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు చేర్పులేమైనా ఉన్నా.. చేసేుకోవచ్చు.

నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్'ను సెప్టెంబరు 29న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు 'స్పైడర్' విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న టైంలోనే సెప్టెంబరు 21న తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు 'జై లవకుశ' టీం ప్రకటించడమూ తెలిసిందే.

మరి ఈ రెండు సినిమాల మేకర్స్ ఏమైనా పునరాలోచన చేస్తారేమో చూడాలి. ఆ రెండూ కూడా యధావిధిగా వచ్చేట్లయితే బాక్సాఫీస్ వార్ హీటెక్కిపోవడం ఖాయం. దాదాపు ఏడాది నుంచి 'స్పైడర్'ను చెక్కుతున్నాడు మురుగదాస్. మామూలుగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. మురుగదాస్ ఇంత టైం తీసుకునేసరికి అంచనాలు మరింత పెరిగాయి. ఇంకొక్క పాట మినహాయిస్తే 'స్పైడర్' చిత్రీకరణ అంతా పూర్తయింది. సమాంతరంగా ప్రి ప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు