చరణ్ గురించి సుక్కు చెప్పిన సీక్రెట్లు

చరణ్ గురించి సుక్కు చెప్పిన సీక్రెట్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అభిమానులకు తెలియని కొత్త కొత్త విషయాలు చెప్పాడు అతడితో 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్న విలక్షణ దర్శకుడు సుకుమార్. తన నిర్మాణంలో తెరకెక్కిన 'దర్శకుడు' సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చరణ్ గురించి మాట్లాడుతూ.. తన గురించి ఆసక్తికర విశేషాల్ని అభిమానులతో పంచుకున్నాడు.

చిరంజీవి కొడుకు.. సిల్వర్ స్పూన్‌తో పుట్టాడు కదా.. అతణ్ని ఎలా డీల్ చేయాలా అని తాను మథన పడ్డానని.. కానీ చరణ్ అందరూ అనుకున్నట్లుగా కాదని.. అతను నిజమైన మట్టిమనిషి అని కితాబిచ్చాడు సుకుమార్. చరణ్ చాలా సహజంగా ఉంటాడని.. డౌన్ టు ఎర్త్ అని అన్నాడు సుక్కు.

'రంగస్థలం' షూటింగ్ పాపికొండల్లో చేసినపుడు అందరికి ఎండ వల్ల ట్యాన్ వచ్చేసిందని.. తామందరం సన్ స్క్రీన్ రాసుకుంటే.. చరణ్ మాత్రం పులిసిన పెరుగులో సున్నిపిండి కలుపుకుని రాసుకునేవాడని సుక్కు వెల్లడించాడు. అలాగే కాఫీలో బెల్లం కలుపుకుని తాగే రకం బాబు చరణ్ అంటూ చమత్కరించాడు సుక్కు. మామూలుగా హీరోల్ని చూసి.. వాళ్లేం సెంట్ వేసుకుంటారు.. ఏం పేస్ట్ వాడతారు.. ఏం క్రీం రాస్తారు అన్న సందేహాలు జనాల్లో ఉంటాయని.. కానీ హీరోలందరూ అలా ఉండరని.. చరణ్ సింపుల్‌గా వేపపుల్లతో పళ్లు తోముకుంటాడని సుకుమార్ తెలిపాడు.

'దర్శకుడు' మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ ప్రస్తావన వచ్చినపుడు.. రామ్ చరణ్‌కు ఈ సినిమా పాటలు చాలా బాగా నచ్చాయని చెబుతూ.. అతడికి సంగీతం విషయంలో మంచి టేస్టుందని.. చరణ్ ఎనిమిదేళ్ల పాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడని.. ఆ విషయం అభిమానులెవ్వరికీ తెలియదని సుకుమార్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు