ఒక రాజమౌళి.. ముగ్గురు హీరోలు

ఒక రాజమౌళి.. ముగ్గురు హీరోలు

''ముందు 'బాహుబలి: ది కంక్లూజన్' విడుదలవ్వాలి.. తర్వాత రిలాక్స్ అవ్వాలి.. వెకేషన్‌కు వెళ్లిరావాలి.. మొత్తంగా ఇంకో రెండు నెలల వరకు నా తర్వాతి సినిమా గురించి ఆలోచించను'' అంటూ 'బాహుబలి-2' విడుదలకు ముందు చెప్పాడు రాజమౌళి. బాహుబలి-2 విడుదలైపోయింది. ఒకటికి రెండు వెకేషన్లకు వెళ్లి వచ్చాడు రాజమౌళి. ఆయన చెప్పిన రెండు నెలల గడువు పూర్తయి కూడా మూడు వారాలు కావస్తోంది. ఇప్పటిదాకా జక్కన్న తర్వాతి సినిమాపై ఏ స్పష్టతా రాలేదు.

ఈ మధ్యలో రాజమౌళి కొత్త సినిమాలో హీరో ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా రాజమౌళి మాత్రం తన తర్వాతి సినిమా గురించి ఒక్క ముక్కా మాట్లాడింది లేదు. అభిమానుల్లో మాత్రం ఈ దర్శక ధీరుడి కొత్త సినిమా విషయంలో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. ఐతే రాజమౌళి తర్వాతి ప్రాజెక్టులో హీరో ఎవరనే విషయంలో ఇప్పుడు కొత్త రూమర్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి కొత్త సినిమాలో హీరో ఒకరు కాదని.. ముగ్గురుంటారని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లోనూ తనకు విపరీతమైన ఫాలోయింగ్.. అతడి సినిమాపై ఆయా భాషల ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ మూడు భాషలకు చెందిన ముగ్గురు హీరోలతో కలిపి ఒక మల్టీస్టారర్ మూవీ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది నిజమే అయితే మాత్రం రాజమౌళి ఎత్తుగడ సూపరనే చెప్పాలి. రాజమౌళి ఇక ఎంతమాత్రం ఏదో ఒక భాషకు పరిమితమయ్యే పరిస్థితి లేదు. దేశంలో అన్ని ప్రధాన భాషల ప్రేక్షకులకూ కనెక్టయ్యే జాతీయ స్థాయి సినిమాలే తీయాలతను. అతడికి ఆ ఫాలోయింగ్ ఉంది. మార్కెట్ ఉంది. అందరినీ మెప్పించే కెపాసిటీ ఉంది.  అలాంటపుడు ఏదో ఒక భాషకు పరిమితం కావాల్సిన అవసరం ఏముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు