దిలీప్‌కు టాలీవుడ్ లింకు!

దిలీప్‌కు టాలీవుడ్ లింకు!

మలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. వేధింపుల కేసులో స్టార్ హీరో దిలీప్ అరెస్టవడం కేరళలో ప్రకంపనలు రేపుతోంది. గత మూడు రోజుల నుంచి కేరళ జనాలకు ఇదే హాట్ టాపిక్. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు మన జనాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు ఎవరీ దిలీప్ అంటూ తెలుగు వాళ్లు కూడా అతడి గురించి ఆరాలు తీస్తున్నారు.

మామూలుగా దక్షిణాదిన ప్రతి స్టార్ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలిసి ఉంటుంది. మన సినిమాలతో ఆ హీరోలకు ఏదో రకంగా లింక్ ఉంటుంది. కానీ దిలీప్ మాత్రం మన ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. మలయాళం నుంచి తెలుగులోకి చాలా సినిమాలే అనువాదం అయ్యాయి. మోహన్ లాల్.. మమ్మట్టి.. సురేష్ గోపి లాంటి వాళ్లు డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతోనూ మన ప్రేక్షకులకు పరిచయమే. కానీ దిలీప్ గురించే మనవాళ్లకు తెలియదు.

ఐతే అతడికి ఇన్ డైరెక్టుగా టాలీవుడ్ తో పరిచయం ఉంది. అతడి సినిమాలు కొన్ని తెలుగులోకి రీమేక్ అయ్యాయి. వేణు హీరోగా నటించిన 'కళ్యాణరాముడు'.. దిలీప్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కళ్యాణ రామన్'కు రీమేక్. తర్వాత మాస్ రాజా రవితేజ నటించిన 'దొంగోడు' కూడా దిలీప్ సినిమానే. మలయాళంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన 'మీస మాధవన్'ను రవితేజ కోసం పట్టుకొచ్చారు.

విశేషం ఏంటంటే.. ప్రస్తుతం తెలుగులో దిలీప్ సినిమా ఇంకోటి రీమేక్ అవుతోంది. సునీల్ హీరోగా 'ఎన్ కౌంటర్' శంకర్ రూపొందిస్తున్న చిత్రం దిలీప్ హీరోగా నటించిందే. ఆ చిత్రం పేరు.. 2 కంట్రీస్. మమత మోహన్ దాస్ కథానాయికగా నటించింది. అది కూడా మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక దిలీప్ వల్ల ఇబ్బంది పడ్డ హీరోయిన్ తెలుగులో డైరెక్ట్ గానే రెండు సినిమాలు చేసింది. అవి రెండూ ఫ్లాపవడంతో ఆమెకు తర్వాత అవకాశాలు రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు