స్పైడర్.. ఆ స్థాయిలో ఏముందబ్బా?

స్పైడర్.. ఆ స్థాయిలో ఏముందబ్బా?

తన కొత్త సినిమా 'స్పైడర్'లో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడన్నది చాన్నాళ్ల కిందటి సమాచారం. ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ చూసినా.. ఆన్ లొకేషన్ పిక్స్ చూసినా ఆ ప్రచారం నిజమే అనిపించింది. మురుగదాస్ 'తుపాకి' తరహాలో కొంచెం థ్రిల్లర్ టచ్ ఇచ్చి ఈ సినిమాను రూపొందిస్తున్నాడని అనుకున్నారంతా. ఐతే కొన్ని నెలల నుంచి ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్.. తాజాగా చిత్ర నిర్మాత ఠాగూర్ మధు చేసిన వ్యాఖ్యలు అవీ చూస్తుంటే మాత్రం అసలు ఈ 'స్పైడర్' జానరేంటో.. దీని కథాంశమేంటో అర్థం కాక అభిమానులు వెర్రెత్తిపోతున్నారు.

'స్పైడర్' సినిమా ఆలస్యం కావడానికి విజువల్ ఎఫెక్ట్స్ పనులే కారణమని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పనులు దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్నాయట. ఆగస్టు నెలాఖరుకు కానీ ఆ పనులు పూర్తి కావని అంటున్నారు. తాజాగా ఠాగూర్ మధు మాట్లాడుతూ.. 'స్పైడర్' వీఎఫెక్స్ పనులు ఆరు దేశాల్లో జరుగుతున్నాయని.. ఔట్ పుట్ చాలా బాగా వస్తోందని అన్నాడు. 'స్పైడర్'లో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ.20 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఐతే 'బాహుబలి' లాంటి సినిమాకో.. లేదా 'రోబో-2' లాంటి చిత్రాలకో ఇంత సుదీర్ఘంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేస్తున్నారని.. అంతేసి ఖర్చు పెడుతున్నారని.. వేర్వేరు దేశాల్లో పని నడుస్తోందని అంటే అర్థం చేసుకోదగ్గదే. కానీ 'స్పైడర్' కథాకథనాలపై ఉన్న అంచనాల ప్రకారం చూస్తే మాత్రం ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అంత సమయం.. అంత ఖర్చు.. అంత శ్రమ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీన్ని బట్టి 'స్పైడర్' ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుందేమో.. ఇది హాలీవుడ్ సైంటిఫిక్ థ్రిల్లర్లను గుర్తు చేస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన 'స్పైడర్' టీజర్ దాని కథాంశం మీద ఎలాంటి ఐడియా ఇవ్వలేదు. ఈ నెలాఖర్లో ఏదో కొత్త టీజర్ అంటున్నారు. అది చూశాకైనా సినిమా ఎలా ఉండబోతుందో ఏమైనా అవగాహన వస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు