కరోనా పోరాటంలో మోడికి షాక్

కీలకమైన కరోనా వైరస్ పోరాటం నేపధ్యంలో నరేంద్రమోడికి పెద్ద షాక్ తగిలింది. కరోనా వైరస్ పై పోరాటం జరుపుతున్న శాస్త్రవేత్తల బృందానికి ఛైర్మన్ అయినా షాహిద్ జమీల్ రాజీనామా చేశారు. దేశంలో ఎక్కడచూసినా కరోనా వైరస్ తీవ్రత బాగా పెరిగిపోతోంది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే వేలాది మంది చనిపోతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కేంద్రానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రముఖ వైరాలజిస్టు, జినోమ్ కన్సార్షియం(ఇన్సాకోగ్) అధిపతిగా షాహిద్ జమీల్ రాజీనామా చేయటం కేంద్రానికి పెద్ద దెబ్బనే చెప్పాలి.

శుక్రవారం ఇన్సాకోగ్ సమావేశంలో పాల్గొన్న జమీల్ తర్వాత తన రాజీనామాను ప్రకటించారు. జమీల్ రాజీనామా చేసిన విషయం తెలియగానే శాస్త్రవేత్తలతో పాటు వైద్యనిపుణులు, ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారట. జమీల్ రాజీనామా విషయంపై సహచర శాస్త్రవేత్తలు మాట్లాడుతు కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై చాలా రోజులుగా జమీల్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

కరోనా మహమ్మారి నియంత్రణకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలను నరేంద్రమోడి దేన్నీ పట్టించుకోవటం లేదట. వ్యాక్సిన్ కొరత, తక్కువ సమయంలో కోవిడ్ పరీక్షల ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలపై జమీల్ ఎన్ని సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోలేదని సమాచారం. టీకా కేంద్రాల సంఖ్య 50 వేలు ఏమాత్రం సరిపోదని ఎప్పటినుండి జమీల్ మొత్తుకుంటున్నా కేంద్రం స్పందించలేదట.

కరోనా వైరస్ ను భారత్ జయించేసిందన్న కేంద్రం పెద్దల ప్రకటనతో టీకా కార్యక్రమం సక్రమంగా జరగలేదట. 50 వేల టీకా కేంద్రాలను కనీసం రెండింతలు చేయాలని జమీల్ ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం చర్యలు తీసుకోలేదట. శాస్త్రవేత్తలకు కేంద్రం నుండి సరైన మద్దతు లభించనపుడు పదవిలో ఉండి ఉపయోగం ఏమిటని జమీల్ చాలాకాలంగా ఆలోచిస్తున్నారట. దాని పర్యవసానమే జమీల్ రాజీనామా అంటు సహచర శాస్త్రవేత్తలు చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది.