సమీక్ష-సినిమా బండి

కొత్తగా సినిమా చేయాలనుకున్నవాళ్లు ఏం చేయాలి..ఎలా చేయాలి…ఈ ప్రశ్న కామన్. అదే ప్రశ్నను సినిమాగా మారిస్తే..అదే సినిమా బండి. ఈవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా. కొత్త దర్శకుడు ప్రవీణ్ కొణతాల, సాదా సీదా నటులను తీసుకుని, ఓ నాచురల్ లోకేషన్ లో చిత్రీకరించిన సినిమా. 1980 దశకంలో గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే సినిమా వచ్చింది. నాగరిక ప్రపంచంతో పరిచయం లేని గిరిజనుల నడుమ ఓ కోక్ కోన్ విమానంలోంచి వచ్చి పడుతుంది. దాన్ని చూసి గిరిజనుల స్పందన, భయం, ఫన్ ఇలా ఒకటి కాదు అనేక ఎమోషన్లు కలిపి ఆ సినిమా. సినిమా బండి సినిమాలో కథకు కీలకమైన పాత్రకు ఓ ఖరీదైన కెమేరా దొరుకుతుంది. అమ్మేసి డబ్బులు చేసుకునే బదులు, దాంతో సినిమా తీస్తే బోలెడు డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచన ఫలితమే సినిమా.

ఓ ఆటో డ్రయివర్ కు ఖరీదైన కెమేరా దొరుకుతుంది. స్నేహితుడైన ఓ పెళ్లిళ్ల పొటోగ్రాఫర్ సాయంతో, ఊరిలోనే ఓ అమ్మాయిని అబ్బాయిని ఒప్పించి సినిమా మొదలుపెడతారు. తెలిసీ తెలియని జ్ఞానం, అమాయకత్వం అన్నీ కలిసి వారిని, వారి సినిమాను ఎక్కడకు చేర్చిందన్నది కథ.

కథలో కోర్ లాజిక్ పాయింట్ పక్కన పెట్టేయాల్సిందే. అందరూ స్మార్ట్ ఫోన్ లు వాడుతూ ఓ ఖరీదైన కెమేరాను వింత వస్తువులా, అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా చూడడం అన్నది ఓ పాయింట్ అయితే, పల్లెటూళ్లలో చిన్న వింత ఏం జరిగినా పట్నం వరకు పాకేస్తుంది. అలాంటిది పోలీసులు, కెమేరా యజమానురాలు వెదుకుతున్న కెమేరా సంగతి బయటకు పొక్కకపోవడం. సరే ఈ లాజిక్ లు వదిలేసి సినిమా సంగతి చూస్తే..

సినిమా బండి ఎత్తుగడ బాగానే వుంటుంది. అవసరాలు, అమాయకత్వం కలిసి సినిమాను బాగానే ముందుకు నడిపిస్తాయి. కానీ ఒకసారి సినిమా తీయడం అన్నది ప్రారంభమయ్యాక, మరిన్ని సీన్లు అది కూడా ఫన్ పండిస్తూ రాసుకోవడంలో దర్శకుడు పెయిల్ అయ్యాడు. దాంతో అక్కడ వరకు వున్న ఆసక్తి ఇక మెల్లగా సన్నగిల్లడం ప్రారంభమవుతుంది. సినిమా తీసిన వారికి చేయడానికి ఏం లేనట్లు, చూసేవారికి చూడడానికి ఏం లేనట్లు తయారవుతుంది పరిస్థితి.

ఇలా ముందుకు సాగిన సినిమాను ఎలా ఎండ్ చేయాలో అన్నది కూడా దర్శకుడికి అందినట్లు లేదు. ముగింపు కాస్త సినిమాటిక్ గా, మరి కాస్త అందంగా వుంటే బాగుండేది. అమాయకంగానైనా, వాళ్లు తీసిన సీన్లు అన్నీ గుదిగుచ్చి అందమైన సినిమాగా కెమేరా అసలు ఓనర్ మార్చినట్లు గా వుంటే చూసే ప్రేక్షకులకు కాస్త సంతృప్తి వుంటుంది. ఇప్పుడు ఎటూ మొగ్గకుండా మిగిలిపోయినట్లు అయింది.

చిన్న సినిమా అయినా సాంకేతిక విలువులు బాగున్నాయి. మంచి కేమేరా పనితనం వుంది. షాట్ ఫ్రేమింగ్ బాగుంది. నేపథ్యసంగీతం కూడా సినిమాకు తగినట్లు వుంది. నటీనటులు, లోకేషన్లు నాచురల్ గా వుంటూనే, మరీ అమెచ్యూర్ గా కాకుండా, టేకింగ్ లో విషయం వున్నట్లు కనిపిస్తుంది. అందువల్ల సినిమా మీద కాస్త ఆసక్తి, సినిమా పట్ల కాస్త ప్రేమ కలుగుతాయి. దానివల్ల సినిమా బండికి పాస్ మార్కులు పడతాయి.

ఫినిషింగ్ టచ్… సినిమా పాసింజర్ బండి