బాబు సూటి ప్రశ్న: నేను వ్యాక్సిన్ తెప్పిస్తే మీరెందుకు?


ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో దేని దగ్గర ఎన్ని వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయో పేర్కొంటూ ఒక మ్యాప్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యూపీలో గరిష్ఠంగా 13 లక్షల దాకా డోసులుంటే.. ఇండియాలోనే అత్యంత కనిష్ఠంగా 2 వేల డోసుల వ్యాక్సిన్ ఉండటం గమనార్హం. దేశంలో మరెక్కడా ఇన్ని తక్కువ డోసులు లేవు. వ్యాక్సిన్ల కొనుగోలు దిశగా ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, ఆర్డర్లు పెట్టకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నది స్పష్టం.

ఐతే ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్లే ఏపీకి వ్యాక్సిన్ డోసులు రావట్లేదని.. భారత్ బయోటెక్ సంస్థ అధినేతలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఏపీకి కోవాగ్జిన్ రాకుండా చంద్రబాబు అడ్డం పడుతున్నారని కొడాలి నాని, అంబటి రాంబాబు తదితర అధికార పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. దీనిపై ఇప్పుడు చంద్రబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం నేతలతో ఆన్ లైన్ సమావేశం సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

ఏపీకి వ్యాక్సిన్ డోసులు రాకపోవడానికి తానే కారణమని.. తానే వ్యాక్సిన్లు తెప్పించాలని అధికార పార్టీ నేతలు అంటున్నారని.. తాను వ్యాక్సిన్ తెప్పిస్తే ప్రభుత్వం ఉన్నది ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. అడ్వాన్సులు చెల్లించకుండా కేవలం లేఖలు రాస్తే ఎవరైనా వ్యాక్సిన్లు ఎలా సరఫరా చేస్తారని చంద్రబాబు అన్నారు. మిగతా రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసున్న వారికి కూడా పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేస్తుంటే.. ఏపీలో మొత్తంగా అందరికీ వ్యాక్సిన్లు ఆపేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం మహారాష్ట్ర గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని బాబు మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు చాలా ముందే వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెడితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చంద్రబాబు అన్నారు.