వకీల్ సాబ్-2పై వేణు శ్రీరామ్ కామెంట్


పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను మించిపోయిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా మొదలైనపుడు చాలా వరకు అభిమానులు పెదవి విరిచారు. ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో పవన్ కళ్యాణ్ నటించడమేంటి.. అందునా రీఎంట్రీకి ఈ చిత్రాన్ని ఎంచుకోవడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఈ సినిమాలోనూ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడమే కాక.. ఒరిజినల్లోని ఎసెన్స్ పోకుండా బ్యాలెన్స్ చేసి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్.

పవన్ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచడమే కాక, పొలిటికల్ మైలేజీకి కూడా ఈ సినిమా ఉపయోగపడటం విశేషమే. ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కొందరిలో కలిగింది. అభిమానులు కూడా ఆ దిశగా ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ ముందు పెడితే ఆసక్తికర జవాబిచ్చాడు.

తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో భాగంగా అభిమానుల ప్రశ్నలను ఇంటర్వ్యూయర్ వేణు శ్రీరామ్ ముందు ఉంచాడు. వకీల్ సాబ్-2 చేసే ఆలోచన ఉందా అన్నది అందులో ఒక ప్రశ్న. దీనికి వేణు బదులిస్తూ.. “నిజానికి నాకు సీక్వెల్ చేసే ఆలోచన లేదు. కానీ సినిమా రిలీజయ్యాక అభిమానులతో పాటు సన్నిహితులు చాలామంది సీక్వెల్ చేస్తే బాగుంటుంది అన్నారు. మనకు ఇప్పుడు వకీల్ సాబ్ అంటే ఎవరో బాగా తెలుసు. ఆ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ కథను కొనసాగించి మరో మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరో అవకావం ఇవ్వాలి. ఆయన ఓకే అని.. దిల్ రాజు గారు కూడా సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తే.. వకీల్ సాబ్-2 చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి” అని వేణు అన్నాడు. మరి ఇప్పుడిలా మొగ్గ తొడిగిన ఆలోచన రేప్పొద్దున నిజంగానే కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.