తమిళ రాజకీయాల్లో స్టాలిన్ రికార్డు

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సరికొత్త రికార్డు సృష్టించారనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి ఎంకే కరుణానిధి రాజకీయ వారసునిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న మొదటి వ్యక్తి స్టాలిన్ మాత్రమే. ఇప్పటివరకు తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రుల వారసులెవరు ముఖ్యమంత్రులు కాకపోవటం గమనార్హం. తమిళనాడు ఏర్పడిన దగ్గర నుండి చాలామందే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే వారసత్వంగా సీఎం అయ్యింది మాత్రమే స్టాలిన్ ఒక్కరే.

1952 నుండి తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా రాజాజీ, కామరాజ్ నాడార్, భక్తవత్సలం, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జానకీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, పన్నీర్ శెల్వం, పళనిస్వామి పనిచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కామరాజ్ నాడార్, జయలలిత అవివాహితులు. అన్నాదురై, ఎంజీఆర్-జానకీ రామచంద్రన్ కు సంతానం లేదు. రాజాజీ, భక్తవత్సలంకు సంతానం ఉన్నా వాళ్ళెవరు రాజకీయాల్లోకి రాలేదు.

ఇక పన్నీర్ శెల్వం కొడుకు రవీంద్రకుమార్ ఎంపిగా ఉన్నారు. పళనిస్వామి సంతానం రాజకీయాల్లో లేరు. ఇక కరుణానిధి సంతానంలో ఇద్దర కొడుకులు, కూతురు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వీరిలో స్టాలిన్ డీఎంకే చీఫ్ గా, డీఎంకే శాసనసభాపక్ష నేత హోదాలో 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. సో 1952 నుండి తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే వారసుని హోదాలో సీఎం అవుతున్న రికార్డు స్టాలిన్ కు మాత్రమే దక్కబోతోంది.

వారసుడంటే కరుణానిధి సీఎంగా ఉండగా మరణిస్తే ఆ ప్లేసులో కూర్చోలేదు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని గట్టిగా నిలబెట్టి ఎన్నికలను ఎదుర్కొని ప్రజాబలంతో మాత్రమే సీఎం అవబోతున్నారు. దేశంలో వారసుల హోదాలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, ఓం ప్రకాశ్ చౌతాలా సీఎంలయ్యారు.