నందిగ్రామ్ లో పోటీవెనుక ప్రధాన కారణం ఇదేనా ?

తాజాగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయమే పార్టీ గెలుపుకు కారణం అయ్యిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంవత్సతరాలుగా పోటీచేస్తున్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో నామినేషన్ వేశారు. నందిగ్రామ్ లో పోటీ చేయటమంటే చాలా పెద్ద సాహసం చేయటమన్న విషయం దీదీకి బాగా తెలుసు. అయినా సాహసం చేశారు కాబట్టే విజయం సిద్ధించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఒకప్పటి మద్దతుదారులు, ప్రస్తుత ప్రత్యర్ధి అయిన సుబేందు అధికారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్. సుబేందు కుటుంబం యావత్తు చాలాకాలంగా మమత మద్దతుదారులుగానే ఉన్నారు. ఈ కుటుంబానికి నందిగ్రామ్ ప్రాంతంలో విపరీతమైన పట్టుంది. సుమారు 35 నియోజకవర్గంలో సుబేందు కుటుంబాన్ని కాదని ఇంకెవరు ఇక్కడే గెలిచే ఛాన్సులేదు. ఈ ప్రాంతాల్లో రాజకీయంగా, ఆర్ధికంగా, వ్యాపారా రంగాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి.

ఎందుకంటే సుబేందు కుటుంబంలో ఇద్దరు ఎంపిలు, పలువురు ఎంఎల్ఏలు, మున్సిపల్ ఛైర్మన్లుగా ఉన్నారు. ఇలాంటి నందిగ్రామ్ లో సుబేందు చాలెంజ్ చేయగానే వెంటనే నామినేషన్ వేసేయటానికి దీదీ ఏమి పిచ్చిదికాదు. కానీ ఇక్కడ పోటీ చేయటం వెనుక దీదీకి చాలా లోతైన ఆలోచనే ఉంది. అదేమిటంటే తాను నందిగ్రామ్ లో పోటీచేయకపోతే ఈ ప్రాంతమంతా సుబేందు కుటుంబం కారణంగా బీజేపీ అభ్యర్ధులు గెలవటం ఖాయం. అదే మమత నందిగ్రామ్ లో పోటీచేస్తే తనను ఓడించటానికి మొత్తం కుటుంబమంతా తన ఓటమికోసం నందిగ్రామ్ లోనే ఉంటారని మమతకు బాగా తెలుసు.

ఊహించినట్లుగానే నందిగ్రామ్ లో నామినేషన్ వేయగానే మమత ఓటమికి యావత్ సుబేందు కుటుంబమంతా ఇక్కడే క్యాంపు వేసింది. నందిగ్రామ్ లో మమతను ఓడించటమంటే తృణమూల్ ను ఓడించటమన్న అంచనాకు సుబేందు కుటుంబం వచ్చింది. దాంతో నామినేషన్ వేసిన తర్వాత సుబేందు కానీ ఆయన కుటుంబసభ్యులు కానీ ఇతర బీజేపీ అభ్యర్ధుల విజయంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారట. అంటే దీదీ ఆలోచించినట్లుగానే సరిగ్గా జరిగింది.

మమత మాత్రం నందిగ్రామ్ లో నామినేషన్ వేసి రాష్ట్రమంతా తిరిగేశారు. నందిగ్రామ్ లో మమత పోటీ చేయకపోతే సుబేందు కూడా నామినేషన్ వేసి ఇతర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధుల విజయం కోసం హ్యాపీగా ప్రచారానికి తిరిగేవారే. కానీ ఇపుడు మమతపై తాను గెలవటమే టార్గెట్ గా నందిగ్రామ్ వదిలి సుబేందు ఎక్కడా తిరగలేకపోయారు. దాంతో మమత ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. మమత ఓడిపోయినా ఇతర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ఇదే సమయంలో మమతపై సుబేందు గెలిచినా ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకోలేకపోయారు.