కంగనా అకౌంట్ లేచిపోయింది

ట్విట్టర్లో అడ్డు అదుపు లేకుండా వ్యాఖ్యలు చేసే సెలబ్రెటీల లిస్టు తీస్తే కంగనా రనౌత్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆమె ఔట్ స్పోకెన్ అని అందరికీ తెలుసు. కథానాయికగా తనకంటూ ఒక ఇమేజ్ వచ్చినప్పటి నుంచి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటూ వస్తోంది.

ఐతే గత ఏడాది కాలంగా ఆమె రాజకీయ వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు భజనలో మునిగి తేలుతున్న ఆమె.. ఆ పార్టీకి ప్రత్యర్థులైన పార్టీలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనతో అలుపెరగని పోరాటం చేస్తున్న కంగనా.. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అక్కడ గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కంగనా ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేసి పడేశారు.

ట్విట్టర్లో అతిగా స్పందించడం ద్వారా కంగనా ఇంతకుముందు కూడా హెచ్చరికలు అందుకుంది. ఆమె అకౌంట్‌ను తాత్కాలికంగా ఒకసారి నిలిపివేశారు. తర్వాత పునరుద్ధరించారు. ఆ సందర్భంలో ట్విట్టర్ యజమానికే హెచ్చరికలు జారీ చేసింది కంగనా. ఇండియాలో ట్విట్టర్ లేకుండా చేస్తానంటూ బెదిరించింది. ఐతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌నే ఉపేక్షించలేదు ట్విట్టర్. ఆయన అధికారంలో ఉండగానే అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. ఇక కంగనా ఎంత? బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన రావాలని కంగనా డిమాండ్ చేసింది.

నరేంద్ర మోడీ రంగంలోకి దిగాలని.. 2000 నాటి ఆయనలోని దూకుడైన నేతను బయటికి తీసుకురావాలని.. గూండాలను దెబ్బ తీయాలంటే ఇంకా పెద్ద గూండా రావాల్సిందే అని ఆమె వ్యాఖ్యానించింది. పరోక్షంగా గోద్రా అల్లర్లను గుర్తు చేస్తూ బెంగాల్‌లో హింసను ప్రేరేపించేలా కంగనా మాట్లాడటంతో ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. మరి ఈ సస్పెన్షన్ తాత్కాలికమా.. శాశ్వతమా అన్నది చూడాలి. ట్విట్టర్లో కంగనాకు 30 లక్షలకు పైగా ఫాలోవర్లుండటం విశేషం.