ప్రేక్షకుల ఆకలి తీర్చేదెవరు?

సినీ పరిశ్రమ మరోసారి సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. సినిమాల షూటింగ్‌లన్నీ ఆగిపోతున్నాయి. థియేటర్లు మూతపడిపోయాయి. కొత్త సినిమాలు విడుదల లేదు. నిర్మాతలకు ఆదాయం లేదు. కార్మికులకు ఉపాధి లేదు. అదే సమయంలో కరోనా కల్లోల సమయంలో కాస్త ఉపశమనం పొందుదాం అనుకుంటే ప్రేక్షకులకు సరైన వినోదమూ లేదు. కరోనా బారిన పడ్డ వాళ్లు సైతం తీవ్ర లక్షణాలు లేకుంటే ఇంటిపట్టున ఉంటున్నపుడు ఏదో ఒక కొత్త సినిమానో చూడాలనే కోరుకుంటారు. ఇక మామూలు ప్రేక్షకుల సంగతి సరేసరి. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎప్పుడూ వేచి చూస్తూనే ఉంటారు. కానీ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అసలు థియేటర్లు ఎక్కడా నడవట్లేదు కూడా. అలాంటపుడు ఓటీటీల్లో కొత్త కంటెంట్ కోసం చూస్తారు. కానీ అక్కడా సరిపడా వినోదం లేకపోయె.

గత ఏడాది లాక్ డౌన్ పెట్టిన కొన్ని నెలలకు.. థియేటర్లు త్వరలో తెరుచుకునే అవకాశం లేదని తేలాక నేరుగా కొత్త చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముందు చిన్న సినిమాలొచ్చాయి. తర్వాత పెద్దవి కూడా రిలీజ్ చేశారు. కానీ ప్రస్తుత సెకండ్ వేవ్ విజృంభణతో అన్ని సినీ పరిశ్రమల్లోనూ స్తబ్దత నెలకొనగా.. కొత్త సినిమాను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే విషయంలో అంత సుముఖతతో కనిపించడం లేదు నిర్మాతలు. హిందీలో ఒక్క ‘రాధె’ మాత్రమే ఈ నెల 13న ఓటీటీలు, డీటీహెచ్‌ల ద్వారా నేరుగా రిలీజవుతోంది. దాన్ని థియేటర్లలోనూ రిలీజ్ చేస్తామంటున్నారు కానీ.. అది నామమాత్రమే. ఇంకే పేరున్న సినిమా కూడా రాబోయే రోజుల్లో రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు.

తెలుగులో అయితే అనసూయ సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్’ మాత్రమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాటపర్వం లాంటి విడుదలకు సిద్ధంగా ఉన్న పేరున్న సినిమాలు ఓటీటీల బాట పట్టే సంకేతాలు ఎంతమాత్రం లేవు. ఇష్క్, ఏక్ మిని ప్రేమకథ లాంటి చిన్న చిత్రాల మేకర్స్ సైతం ఆ దిశగా ఆసక్తి చూపించట్లేదు. వచ్చే నెల రోజుల్లో అయితే పరిస్థితులు మెరుగుపడతాయన్న సంకేతాలే కనిపించడం లేదు. మళ్లీ థియేటర్లు మునుపటిలా ఎప్పుడు నడుస్తాయో తెలియట్లేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల పరిస్థితి రెంటికీ చెడ్డట్లు తయారైంది. మరి వారి ఆకలి తీర్చేదెవరో?