ఇంటెలిజెన్స్ రిపోర్టు కరెక్టేనా ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విషయంలో ఇంటెలిజెన్స్ నివేదిక ఇపుడు చర్చగా మారింది. తిరుపతి ఉపఎన్నికలో గెలుపే టార్గెట్ గా ఇటూ వైసీపీ అటు టీడీపీ పెద్దఎత్తున పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. రికార్డుస్ధాయిలో మెజారిటి కోసం వైసీపీ నేతలు పోరాటం చేశారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ఎలాగైనా సంపాదించుకోవాలని టీడీపీ నేతలు కూడా అవస్తలుపడ్డారు. సరే ఎవరి పోరాటం ఎలాగున్నా పోలింగ్ అయితే అయిపోయింది.

2019 ఎన్నికల్లో జరిగిన పోలింగ్ తో పోల్చితే మొన్నటి ఉపఎన్నికలో పోలింగ్ బాగా తగ్గిపోయింది. 2019లో 80 శాతం పోలింగ్ నమోదైతే మొన్నటి ఎన్నికలో 64 శాతం మాత్రమే నమోదైంది పోలింగ్. పోలింగ్ శాతం ఎలాగున్నా అంతకు రెండు రోజుల ముందు స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వంలోని పెద్దలకు ఓ రిపోర్టు అందించారట. నిజంగా ఆ రిపోర్టు అలారమింగ్ గానే ఉంది.

విశ్వసనీయవర్గాల ప్రకారం ఇంటెలిజెన్స్ పంపిన రిపోర్టులో నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ వైసీపీ అనుకున్నంతగా సానుకూలం కాదట. గూడూరులో వైసీపీ ఎంఎల్ఏ వరప్రసాద్ పైన బాగా బ్యాడ్ ఇమేజి ఉందని రిపోర్టులో చెప్పారట. దానికి తోడు వరప్రసాద్ వైసీపీ ఎంపి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు పెద్దగా కష్టపడలేదని చెప్పారట. ఎంఎల్ఏ మీద వ్యతిరేకతకు తోడు అసలు ఆయనే ప్రచారం చేయని కారణంగా ఇక్కడ వైసీపీకి మైనస్ అయ్యే అవకాశాలున్నాయట.

అలాగే వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి మీద పార్టీలోనే బాగా వ్యతిరేకత వచ్చేసిందట. ఇదే సమయంలో నేతలను కలుపుకుని వెళ్ళటంలో ఆనం కూడా పెద్దగా ఇంట్రస్టు చూపటంలేదు. దీని ప్రభావం ఉపఎన్నికలో కనబడిందని ఇంటెలిజెన్స్ రిపోర్టులో చెప్పారట. ఇక జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ సపోర్టరుగా ఉన్న వైసీపీ ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డి నియోజకవర్గం సర్వేపల్లిలో కూడా పార్టీకి మైనస్ తప్పదని రిపోర్టులో చెప్పారట.

అయితే ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో ఓ చర్చ జరుగుతున్నా దాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. తమకు అత్యధిక మెజారిటి రావటం ఖాయమంటున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో ప్రచారంలో ఉన్నదంతా టీడీపీ సృష్టిగా కొట్టిపారేస్తున్నారు. తమకు అన్నీ నియోజకవర్గాల్లోను మంచి మెజారిటి రావటం ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి వాస్తవం ఏమిటో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.