టీడీపీ మాజీ మంత్రి ఒంట‌ర‌య్యారా ?


మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ప్ర‌స్తుతం పెద్ద చిక్కులో ప‌డ్డారు. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం కోసం.. తిరుప‌తికి వ‌చ్చిన ఆయ‌న‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఒక వీడియోను కూడా ప్ర‌ద‌ర్శించారు. అప్ప‌ట్లో తిరుప‌తిపై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారంటూ.. ఆయ‌న ఆ వీడియోలో మీడియాకు చూపించారు. దీంతో పార్టీ వైపు ప్ర‌జ‌లు సానుకూలంగా మారుతార‌ని అనుకున్నారు. అయితే.. దీనిని అప్ప‌ట్లో టీడీపీ త‌న‌కు అనుకూలంగా బాగానే ప్ర‌చారం చేసుకుంది. ఇక‌, టీడీపీ అనుకూల మీడియా కూడా దీనిని ప‌దేప‌దే ప్ర‌సారం చేసింది.

అయితే.. జ‌గ‌న్ చేశారంటూ.. మాజీ మంత్రి ఉమా ప్ర‌చారం చేసిన వ్యాఖ్య‌లు బూట‌క‌మ‌ని.. ఆ వీడియో మార్ఫింగ్ చేశార‌ని పేర్కొంటూ.. ఓ వైసీపీ సానుభూతి ప‌రుడు.. సీఐడీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ పోలీసులు కేసులు న‌మోదు చేసి.. ఉమాకు ఇప్ప‌టికి మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. తొలిసారి వాట్సాప్‌లో పంపించారు. దీనికి స్పందించ‌ని నేప‌థ్యంలో విజ‌యవాడ గొల్లపూడిలోని మాజీ మంత్రి ఇంటికి వ‌చ్చి స్వ‌యంగా నోటీసులు అంటించి వెళ్లారు. కేవ‌లం ప‌ది నిముషాల్లోనే సీఐడీ కార్యాల‌యానికి రావాల‌ని దానిలో పేర్కొన‌డం అప్ప‌ట్లో వివాద‌స్ప‌ద‌మైంది. ఇక‌, రెండు రోజుల కింద‌ట కూడా 19వ తారీకు వ‌చ్చి హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. దేవినేని ఉమా.. స్పందించ‌క‌పోవ‌డంతో 20వ తారీకు నేరుగా ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు (అరెస్టు చేసేందుకు అంటున్నారు) గుంటుప‌ల్లికి వ‌చ్చారు. అయితే.. ఉమా ఇంట్లో లేరు. కానీ, టీడీపీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించార‌ని.. తెలుస్తోంది. స‌రే.. ఏం జ‌రుగుతుంది.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అస‌లు ఇంత జ‌రుగుతున్నా.. టీడీపీ నుంచి అటు లోకేష్ కానీ.. ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు కానీ.. లేదా ఉమా సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ.. ఏ ఒక్క‌రూ దీనిపై స్పందించ‌క‌పోవ‌డం.. ఉమాకు అండ‌గా నిల‌వ‌క‌పోవ‌డం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఇంత విప‌త్క‌ర ప‌రిస్థితిలో కూడా ఉమాకు అండ‌గా నిల‌బ‌డ‌క‌పోతే.. ఎలా అనే వారు కూడా క‌నిపిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉమా ఒంట‌ర‌య్యారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా టీడీపీ నేత‌లు అంద‌రూ ముందు నుంచి ఉమా విష‌యంలో కాస్త దూరం దూరంగానే ఉంటారు. ఇప్పుడు కూడా వారు ఏ మాత్రం స్పందించ‌డం లేదు.