కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంతకమ్ముతున్నారంటే..

Illustrative picture of coronavirus vaccine under trail

నెల రోజుల ముందు దేశవ్యాప్తంగా చాలా చోట్ల వ్యాక్సినేషన్ సెంటర్లు వెలవెలబోయాయి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, ఇక భయం లేదని భావించి జనాలు వ్యాక్సినేషన్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు జనాల్లో మళ్లీ భయం కనిపిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. కానీ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేదు.

ఐతే ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చురుగ్గానే సన్నాహాలు చేస్తోంది. అలాగే విదేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చింది. అంతే కాక ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్‌కు అనుమతులు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఐతే ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర మరీ ఎక్కువేమీ ఉండదని స్పష్టమవుతోంది. వీలైనంత తక్కువ ధరకే వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది.విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. తాము కోవిషీల్ట్ టీకాను ఎంత ధరకు అమ్ముతున్నది వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో టీకా ధర రూ.400 చొప్పున, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 చొప్పున కోవిషీల్డ్‌ను ఇస్తున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ప్రపంచ స్థాయిలో టీకాల ధరలతో పోలిస్తే ఇది తక్కువ మొత్తమే.

అమెరికా టీకాలు ఏవి తీసుకున్న రూ.1500కు తక్కువగా లేవు. చైనా, రష్యా టీకాల ధరలు రూ.750కు పైమాటే. రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 చొప్పున ధరతో కొని ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తున్నాయి. కోవిషీల్డ్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 చొప్పున ఇస్తుండగా.. అవి రూ.1000కి మించకుండా ధరతో టీకా వేసే అవకాశముంది. దీంతో పోలిస్తే కోవాగ్జిన్ ధర ఇంకా తక్కువే కావడం విశేషం. దీన్ని బట్టి ఇండియాలో వ్యాక్సిన్లను చౌక ధరకే అందిస్తున్నట్లు లెక్క.