వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి దేశానికి ఆక్సిజన్

విశాఖ స్టీల్ ప్లాంటు ఘన చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసి, మరెంతోమంది విలువైన ఆస్తులను రాసిచ్చి విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటయ్యేలా చూస్తే.. నాటి నుంచి గొప్ప పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇలాంటి సంస్థకు సొంత గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు చవిచూస్తే.. దాన్నే సాకుగా చూపించి ప్రైవేటు పరం చేయడానికి అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

సంస్థను మళ్లీ లాభాల బాట ఎలా పట్టించాలో నిపుణులు స్పష్టంగా చెబుతున్నా సరే.. అలాంటి సూచనలేవీ పట్టించుకునే స్థితిలో కేంద్రం కనిపించడం లేదు. స్థానికంగా ఉద్యమాలు జరుగుతున్నా చూసీ చూడనట్లే వ్యవహరిస్తోంది. ఈ సంగతలా ఉంచితే ప్రభుత్వం చేతుల్లో ఉండటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశానికి ఎంత సేవ చేస్తోందో చెప్పడానికి తాజాగా ఒక ఉదాహరణ చూడాల్సిందే.

ప్రస్తుతం కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో రోగులకు అందించడానికి సరిపడా ఆక్సిజన్ లేదు. ఈ స్థితిలో రతన్ టాటా, ముకేశ్ అంబాని లాంటి కుబేరులు తమ సంస్థల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంబాని వంద టన్నుల ఆక్సిజన్ ఇవ్వడానికి ముందుకొస్తే.. టాటా 300 టన్నులిస్తానని ప్రకటించాడు. ఐతే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఇప్పటిదాకా 8200 టన్నులకు పైగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఇప్పటిదాకా అంత భారీ స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ పంపారు.

ప్రస్తుతం మహారాష్ట్రాలో కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఆక్సిజన్ దొరక్క అక్కడి రోగులు అల్లాడిపోతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా కోసం మహారాష్ట్ర నుంచి ఏడు భారీ ట్యాంకర్లు గూడ్స్ బండి ద్వారా వైజాగ్‌కు వచ్చాయి. స్టీల్ ఫ్యాక్టరీలో వాటిని పూర్తిగా ఆక్సిజన్‌తో నింపి మహారాష్ట్రకు పంపుతున్నారు. ఇలాంటి సంస్థ ఇప్పటికే ప్రైవేట్ పరం అయి ఉంటే దేశానికి ఇంత సేవ చేయగలిగేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను కేంద్రం మానుకోవాలని అంటున్నారు.