మ‌రో గెలుపే టార్గెట్‌గా ‌వైసీపీ దూకుడు… ఏ ఎన్నికో తెలుసా ?


తూర్పుగోదావ‌రి జిల్లాకు త‌ల‌మానిక‌మైన రాజ‌మండ్రి మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు మ‌రో నెల రోజుల్లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. గ్రామాల విలీనం స‌మ‌స్య కావ‌డంతో ఈ కేసు కోర్టుకువెళ్లింది. దీంతో మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగినా.. రాజ‌మండ్రికి మాత్రం జ‌ర‌గ‌లేదు. దీంతో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రిగేలా.. ముసాయిదా ప్ర‌క‌ట‌న తీసుకువ‌చ్చిన‌ ప్ర‌భుత్వం దీనికి సంబంధించిన అంశంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో రాజ‌మండ్రిలో రాజ‌కీయ వేడి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క‌మైన విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, గుంటూరు లాంటి కీల‌క‌ కార్పొరేష‌న్ల‌ను ద‌క్కించుకున్న‌ట్టుగానే రాజ‌మండ్రిని కూడా సొంతం చేసుకునేందుకు వైసీపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

అయితే.. ఇత‌ర ప్రాంతాల‌కు రాజ‌మండ్రికి తేడా ఉంది. ఇక్క‌డ సంస్థాగ‌త టీడీపీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. పైగా రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రూ కూడా టీడీపీ నేత‌లే. ఇప్ప‌టికే గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఈ కార్పోరేష‌న్‌పై టీడీపీ జెండాయే ఎగిరింది. దీంతో ఇక్క‌డ టీడీపీని బ‌లంగా ఎద‌రిస్తేనే త‌ప్ప‌.. వైసీపీకి విజ‌యం చేరువ అవ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న ఉంది. ఇక‌, మారుతున్న రూపురేఖ‌ల మేర‌కు.. రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 52కు పెరుగుతోంది. ఒక్కో డివిజన్‌లో పదివేలకు తగ్గకుండా ఓటర్లు ఉండొచ్చని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జనరల్‌ ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యే సీట్లు కోల్పోయి.. ఎంపీ సీటును, రాజానగరం ఎమ్మెల్యే స్థానాన్ని గెల్చుకున్న వైసీపీ మొత్తం 52 డివిజన్లలో గెలిచి కార్పొరేషన్‌లో క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూస్తోంది. రాజమండ్రి సిటీ వైసీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వచ్చాక పార్టీ దూకుడు పెంచిందని చెబుతున్నారు. రూరల్‌ ఇంఛార్జ్‌ చందన నాగేశ్వరరావు సైతం ఆకులతో కలిసి సాగుతున్నారట. వీరిద్దరూ ఎంపీ భరత్‌ వర్గంగా ముద్ర పడింది. రెండు మూడు నెలల్లో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగొచ్చని తెలుస్తున్న నేప‌థ్యంలో అంద‌రినీ క‌లుపుకొని వెళ్లేందుకు నాయ‌కులు కృషి చేస్తున్నారు.

ఎంపీ భ‌ర‌త్ కార్పోరేష‌న్‌పై వైసీపీ జెండా ఎగ‌ర‌వేసే బాధ్య‌త తీసుకున్నారు. భ‌రత్ పై జ‌గ‌న్ న‌మ్మ‌కం పెట్ట‌డంతోనే రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి వ‌ర్గంగా ఉన్న ఇద్ద‌రు కో ఆర్డినేట‌ర్లు తొల‌గించి భ‌ర‌త వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు. భ‌ర‌త్ టీడీపీ నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు ప్రోత్స‌హించేందుకు ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీ నేత‌ల‌ను దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంపీ హ‌వా పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. దీంతో ఇక్క‌డ సునాయాసంగానే గ‌ట్టెక్కుతామ‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు.