మోడీకి ఏం చేయాలో చెబుతూ లేఖ రాసిన మన్మోహన్.. ఏముంది?

రాజకీయాల్ని పక్కన పెడితే.. మేధావిగా.. దేశ ఆర్థిక సమస్యలకు చికిత్స చేసే సత్తా ఉన్న ఆర్థికవేత్త కమ్ రాజకీయ నేతగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను చెప్పాలి. సోనియమ్మ చేతిలో రిమోట్ గా మారి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు కానీ.. ఆయన హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉందని చెప్పాలి. వరుసగా చోటు చేసుకున్న కుంభకోణాల్ని అరికట్టటంలో ఆయన ఫెయిల్ అయ్యారే కానీ.. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సమర్థంగా వ్యవహరించటంలో ఆయన్ను నిందించలేం.

పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించినప్పటికి.. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత..ఎంతో అవసరమైతే తప్పించి కలుగజేసుకోకుండా ఉంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు. ఎంతో అత్యవసరమైతే తప్పించి.. ఇష్యూలపై స్పందించని ఆయన తత్త్వాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. ఓపక్క వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు.. అంచనాలకు మించిన నమోదవుతున్న పాజిటివ్ కేసులతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దీంతో పాటు.. ఆక్సిజన్ కొరత..రెమెడెసివర్ లాంటి మందుల కొరతతో తెగ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మన్మోహన్ స్పందించారు. మోడీ సర్కారు తప్పుల్ని.. వైఫల్యాల్ని కళ్లకు కట్టేలా ఆయన లేఖలోని అంశాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ తన తఢాఖా చూపిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లుగా మోడీ సర్కారు స్పందించటం లేదన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. మన్మోహన్ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ప్రధాని మోడీకి ఆయన ఒక లేఖలో  మహమ్మారిని ఎదుర్కోనేందుకు కొన్ని సూచనలు చేశారు. అదే సమయంలో.. ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని చెప్పటం ద్వారా.. ఏమేం చేయలేదో చెప్పేశారు. అంతేకాదు.. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వ్యూహం ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేశారు.

మోడీకి మన్మోహన్ రాసిన లేఖలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..
–  దేశంలో ఎంతమంది వ్యాక్సిన్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు. దేశ జనాభాలో ఎంత శాతం మందికి టీకా ఇచ్చామన్నదే ముఖ్యం.
–  ఈ విషయంలో భారత్ చాలా వెనుకబడిపోయింది.  టీకా కార్యక్రమాన్ని మరింత వేగంగా కొనసాగించాలి.
–  వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కరోనా టీకాల కోసం ప్రభుత్వం పెట్టిన ఆర్డర్ల వివరాల్ని వెల్లడించాలి.
– రానున్న ఆర్నెల్లలో అందే టీకాలు ఎన్ని? అవి ఎక్కడ నుంచి రాబోతున్నాయో తెలియజేయాలి
–  వివిధ కంపెనీల నుంచి అందే టీకాల్ని రాష్ట్రాలకు ఎలా పంచబోతున్నారో వివరించాలి
–  అత్యవసర పరిస్థితుల కోసం కేంద్రం 10 శాతం టీకాల్ని ఉంచుకోవాలి
–  రాష్ట్రాలకు టీకాలు ఎంత పంచబోతున్నారో తెలియజేస్తే.. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది
–  వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కేంద్రం కొన్ని ప్రోత్సాహాకాలు ఇవ్వాలి. దీంతో.. ఆ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునే వీలుంది.
–  ఐరోపా మెడికల్ ఏజెన్సీ.. యూఎస్ఎఫ్ డీఏ లాంటి ప్రాధికార సంస్థలు ఆమోదించిన టీకాల్ని ఎలాంటి షరతులు లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలి.