రెహమాన్‌కు చేదు అనుభవం


భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ ఒకడు. ఆయన స్థాయి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆస్కార్ అవార్డులకు మన సినిమా నామినేట్ అవడమే గొప్ప అనుకుంటే.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ఏకంగా రెండు ఆస్కార్ పురస్కారాలు అందుకుని ఔరా అనిపించిన ఘనుడు రెహమాన్. ఆ సినిమా తర్వాత రెహమాన్ మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కానీ ఆయన గత దశాబ్ద కాలంలో రెహమాన్ నుంచి ఆయన స్థాయికి తగ్గ ఆడియోలు రావట్లేదనే కంప్లైంట్ జనాల్లో ఉంది. ఆయన ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో కొంచెం దెబ్బ తిన్న మాట వాస్తవం.

ఇదిలా ఉంటే ఇప్పుడు రెహమాన్ కెరీర్లో ఎన్నడూ చేయని ఓ సాహసం చేశారు. సొంతంగా ఓ సినిమాకు కథ అందించాడు. సొంత నిర్మాణ సంస్థ పెట్టి మరీ ఆ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రమే.. 99 సాంగ్స్.

దాదాపు మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు రెహమాన్. బహుశా ఆయన సినిమాల్లో మ్యూజిక్ క్వాలిటీ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం ఏమో. ఐతే ఇంత కష్టపడి, భారీగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల ఫలితం తప్పేలా లేదు. శుక్రవారం వివిధ భాషల్లో రిలీజైన ‘99 సాంగ్స్’కు పాజిటివ్ టాక్ రాలేదు. రివ్యూలన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి.

సినిమా మరీ స్లో అంటున్నారు. అనుకున్నంత ఎమోషన్ పండలేదని చెబుతున్నారు. హీరో సహా చాలామంది కొత్త వాళ్లు కావడం వల్ల కూడా సినిమాకు అనుకున్నంత బజ్ రాలేదు. రివ్యూలు కూడా బాగా లేకపోవడంతో ఓపెనింగ్స్ పరంగా సినిమా తేలిపోయింది. కరోనా భయం ఉన్నట్లుండి పెరిగిపోవడంతో జనాలు కూడా థియేటర్లకు వెళ్లడానికి సంకోచిస్తున్నారు. దీంతో ‘99 సాంగ్స్’ థియేటర్లు వెలవెలబోతున్నాయి. సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా రావడం డౌటే అంటున్నారు. రెహమాన్‌కు ఈ సినిమా చేదు అనుభవం మిగల్చడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండిట్లు.