అందరి ఆశలు హైకోర్టుపైనే

ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రైవీటకరణపై ఇప్పటికే కేంద్రమంత్రులు చాలాసార్లు పార్లమెంటులోనే చాలా ప్రకటనలు చేశారు. ప్రైవేటకరణను నిరసిస్తు విశాఖపట్నంలోని ప్రజాసంఘాలు, పార్టీలు ఎంతగా ఆందోళన చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు.

ఈ నేపధ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేడీ దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ప్రైవేటీకరణ నిర్ణయానికి ముందు కేంద్రం పరిశీలించిన అంశాలు ఏమిటో చెప్పమని కోర్టు స్పష్టంగా కోరింది. నష్టాలు వస్తున్నాయన్న ఏకైక కారణంతో వేలాదిమంది పనిచేస్తున్న సంస్ధను ప్రైవేటుపరం చేసేస్తారా ? అంటు హైకోర్టు కేంద్రాన్ని నిలదీసింది.

నష్టాలను అధిగమించేందుకు తీసుకున్న చర్యలేమిటి ? ప్రైవేటుపరం కాకుండా రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఏమిటి ? అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి ? ఎప్పటినుండి వస్తున్నాయంటూ ఘాటైన ప్రశ్నలే వేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తుత ఆర్ధిక పరిస్దితి ఏమిటనే విషయమై పూర్తి వివరాలు సమర్పించాలంటు కోర్టు ఒకవైపు కేంద్రాన్ని మరోవైపు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా ఆదేశించింది.

జేడీ పిటీషన్ పై హైకోర్టు ఈ స్ధాయిలో స్పందిస్తుందని బహుశా చాలామంది ఊహించుండరు. ప్రైవేటీకరణ నిర్ణయంలో తాను జోక్యం చేసుకునేది లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ నిర్ణయం వల్ల తలెత్తే దుష్ఫలితాలు, ప్రభావాలు, బాధితుల విషయంలో జోక్యం చేసుకునే హక్కు న్యాయస్ధానానికి ఉందని చెప్పింది.

ఫ్యాక్టరీ నిర్మాణం అప్పుడు సేకరించిన భూములు, అప్పట్లో భూయజమానులకు ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా ? అనే విషయాన్ని పరిశీలించనున్నట్లు చెప్పింది. కోర్టు జారీచేసిన నోటీసులోని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రైవేటీకరణ ఆగిపోతుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో భూయజమానులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేర్చలేదు. కాబట్టి ఈ విషయంలోనే ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని హైకోర్టు అడ్డుకుంటుందని అనుకుంటున్నారు. మరి విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.