రాజ‌కీయాల‌కు ఇద్ద‌రు టీడీపీ సీనియ‌ర్లు గుడ్ బై ?

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు ఈ ప‌రిస్థితే కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌న్న నిర్ణ‌యంతో ఉన్నారు. మ‌రి కొంద‌రు రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌న్న ఆస‌క్తి ఉంటే ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. సీనియ‌ర్లు మాత్రం ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీలో రాజ‌కీయం చేయ‌నూ లేరు… అలాగ‌ని ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌నూ లేరు అన్న నేత‌లు కూడా ఉన్నారు. పార్టీలో యేళ్ల‌కు యేళ్లుగా బండి లాక్కొస్తున్న ఆ సీనియ‌ర్లు రాజ‌కీయాల‌కు ఇక దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యించుకుంటోన్న ప‌రిస్థితి. ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు దాదాపు రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలే చెపుతున్నారు.

విచిత్రం ఏంటంటే ఆ ఇద్ద‌రు ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాగా… వీరిద్ద‌రు క‌మ్మ సామాజిక వ‌ర్గంనేత‌లే కావ‌డం మ‌రో విశేషం. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివ‌రాం, కొండ‌పి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ పోతుల రామారావు ఇద్ద‌రూ రాజ‌కీయాల‌కు ఇక దూర‌మైపోయిన‌ట్టే అన్న ప్ర‌చారం జిల్లా టీడీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

వీరిలో దివి శివ‌రాం మూడు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయారు. 2014లో ఆయ‌న‌పై వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి రావ‌డంతో శివ‌రాంకు నామినేటెడ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో రామారావుకే సీటు ఇవ్వ‌గా ఆయ‌న ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక పోతుల రామారావు కాంగ్రెస్‌లో ఓ సారి, ఆ త‌ర్వాత వైసీపీ నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో కందుకూరులో ఓడిపోయాక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు అనారోగ్యం కార‌ణంతో ఆయ‌న రాజ‌కీయాల నుంచి దాదాపు నిష్క్ర‌మించిన‌ట్టే అన్న టాక్ వ‌చ్చేసింది.
ఈ ఇద్ద‌రు బ‌డా నేత‌లు కందుకూరు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటే ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వ స‌మ‌స్య ఏర్ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు కొంద‌రు నేత‌లు రంగంలో ఉన్నారు.

దామ‌చ‌ర్ల కుటుంబానికి చెందిన యువ‌నేత దామ‌చ‌ర్ల స‌త్య‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌లివేటివారి పాలెం మండ‌లానికి చెందిన బిల్డర్ రాజేష్ కందుకూరు టీడీపీ ప‌గ్గాల కోసం పావులు క‌దుపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కమ్మ సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉండ‌డంతో పార్టీ అధిష్టానం సైతం క‌మ్మ‌ల‌కే సీటు ఇస్తుంద‌న్న టాక్ ఉంది. అందుకే అదే వ‌ర్గానికి చెందిన ఈ ఇద్ద‌రు నేత‌లు కందుకూరు ప‌గ్గాల వేట‌లో ఉన్నారు. మ‌రి శివ‌రాం, రామారావు స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారో ? చూడాలి.