జ‌గ‌న‌న్న రాజ్యంలో ‘చెప్పుల‌’ నిర‌స‌న‌

ఏపీలో త‌మది సంక్షేమ పాల‌న‌.. అని ప్ర‌చారం చేసుకుంటున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి న‌లుదిక్కుల నుంచి ‘చెప్పుల’ నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ రెండేళ్ల పాల‌న‌తో అద్భుత‌మైన సంక్షేమాన్ని అందిస్తున్నామ‌ని ఇటు సీఎం, అటు మంత్రులు ఊద‌ర గొడుతున్నారు. ఎన్న‌డూ చేయ‌ని సంక్షేమం అమ‌లు చేస్తున్నామ‌ని.. అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నామ‌ని.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక వంటి అనేక ప‌థ‌కాలు.. అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు, బీసీ సామాజిక వ‌ర్గానికి భారీ ఎత్తున కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు.

మ‌రి ఇంత‌గా ప్ర‌జ‌ల‌కు మేళ్లు చేస్తున్నాం క‌నుక‌.. మాదే అస‌లు సిస‌లు సంక్షేమ రాజ్యం అని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించుకుంటున్నారు. అయితే.. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌త నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు విద్యార్థుల నుంచి నిరుద్యోగుల వ‌ర‌కు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. “ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు.. మా చెప్పుల‌తో మేమే కొట్టుకుంటున్నాం” అని ఆక్రంద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఎస్సీ నాయ‌కులు చెప్పుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మ‌రి ఇదంతా ఎందుకు జ‌రుగుతున్న‌ట్టు?

ఎస్సీల ప‌ట్ల త‌మ‌కు ప్ర‌త్యేక దృష్టి ఉంద‌ని చెప్పుకొనే జ‌గ‌నన్న సంక్షేమ పాల‌న‌లో చెప్పుల నిర‌స‌నలు తెర‌మీదికి ఎందుకు వ‌స్తున్నట్టు? అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదీ ఊరికే రాదు.. అన్న‌ట్టుగా.. ఏ నిర‌స‌న వెనుక అయినా.. ప్ర‌జ‌ల గుండె మంట ఉంటుంది. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయ కోణంలో చూడ‌డం నేత‌ల‌కు అలవాటే. అయితే.. ఈ రాజ‌కీయ కోణం.. స‌ద‌రు ఎస్సీ వ‌ర్గాల‌ను నిలువునా కాల్చేస్తోంది. రెండు కీల‌కమైన ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ త‌న పాల‌న‌లో ఎస్సీల‌కు దూరం చేశారు. ఇవి రెండూ కూడా ఆయా సామాజిక వ‌ర్గాల‌ను తీవ్రంగా వేధిస్తున్నాయి.

ప్ర‌ధానంగా చంద్ర‌బాబు హ‌యాంలో అప్ప‌టి మంత్రి జ‌వ‌హ‌ర్ సూచ‌న‌ల మేర‌కు డ‌ప్పు క‌ళాకారుల‌కు సామాజిక పింఛ‌న్ ప్ర‌వేశ పెట్టారు. ఎస్సీల్లో మాదిగ సామాజిక వ‌ర్గం ఇప్ప‌టికీ డ‌బ్బు వృత్తినే న‌మ్ముకుని జీవిస్తోంది. అయితే.. వీరిలో వృద్ధులు అయిన వారు.. వ‌యో భారం స‌హా దివ్యాంగ‌త్వంతో ఇబ్బంది ప‌డుతున్న వారికి పింఛ‌న్ ఇవ్వాల‌న్న జ‌వ‌హ‌ర్ సూచ‌న‌ల మేర‌కు 2018లో చంద్ర‌బాబు డ‌ప్పు క‌ళాకారుల‌కు పింఛ‌న్ ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టారు.కానీ, జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. దీనిని ఎత్తేశారు. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష‌ల మంది క‌ళాకారులు పింఛ‌న్‌ను కోల్పోయారు.

ఇక‌, ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల్లోని పిల్ల‌లు ఉన్న‌త విద్య‌ను అందునా విదేశాల్లో అభ్య‌సించేందుకు వీలుగా.. ‘అంబేడ్క‌ర్ విదేశీ ఉన్న‌త విద్యా ప‌థ‌కం’ను చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌వేశ పెట్టారు. దీనిని న‌మ్ముకుని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఎస్సీ త‌ర‌గ‌తుల‌కు చెందిన విద్యార్థులు విదేశాల‌కు వెళ్లారు. జ‌గ‌న్ హ‌యాంలో దీనిని క‌ట్ చేశారు. జ‌గ‌న‌న్న విద్యాదీవెన ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నాం.. క‌నుక‌.. ఇది అవ‌స‌రం లేద‌న్నారు. కానీ, ఈ ప్ర‌భావం ఎస్సీల‌పై బాగానే ప‌డింది. ఈ కార‌ణంగానే జ‌గ‌నన్న సంక్షేమ పాల‌న‌లో చెప్పులు రాజ్య‌మేలుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. వారి ఆవేద‌న‌ను జ‌గ‌న్ వింటారా? త‌న ప‌ద్ధ‌తి మార్చుకుంటారా ? చూడాలి.