సత్తా ఏమిటో తేలిపోతుందా ?

రాజకీయనేతలకు ఉండాల్సిన ముఖ్య లక్షణం పదిమందిని కలుపుకునే పోవటం. ఎంతమంది మిత్రులను చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాలు అంత ప్రశాంతంగా ఉంటుంది. రేపు ఎన్నికల సమయంలో ఒంటరిపోరాటం చేసేకన్నా నలుగురితో పొత్తలు పెట్టుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారు. కాబట్టి మిత్రపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా టాక్ ఆఫ్ ది తెలంగాణా అవుతున్న షర్మిల గురించే.

ఉద్యోగుల భర్తీ డిమాండ్ తో నిరాహార దీక్ష చేయటానికి పోలీసులు వైఎస్ షర్మిలకు అనుమతించారు. అంటే గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు దగ్గర షర్మిల నిరాహార దీక్ష చేయనున్నారు. మూడు రోజుల దీక్షకు అనుమతి అడిగితే ప్రస్తుత కరోనా వైరస్ తదితరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు.

ఇక్కడ గమనించాల్సిందిగా దీక్ష ఒక్కరోజా లేకపోతే మూడు రోజులా అనికాదు. షర్మిల చేయబోయే దీక్షలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ? అన్నదే కీలకమైంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రముఖ ప్రజ గాయకుడు గద్దర్ తో పాటు అనేకమందికి షర్మిల తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పేరుపేరున లేఖలు రాశారు. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేయబోయే దీక్షకు మద్దతుగా వచ్చి తనకు సంఘీభావం చెప్పాల్సిందిగా షర్మిల లేఖల్లో కోరారు.

కేసీయార్ వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీనే చేయలేదని వామపక్షాలు, నిరుద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ఎన్నో వేదికలపై సీఎంను పదే పదే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి షర్మిల చేయబోయే దీక్షలో ఎంతమంది మద్దతుగా నిలబడతారో ? ఎంతమంది దీక్షలో పాల్గొని సంఘీభావం చెబుతారో తేలిపోతుంది. అంటే దీక్షలో షర్మిలకు మద్దతు ఇచ్చే వాళ్ళని బట్టి భవిష్యత్తులో షర్మిలతో చేతులు కలపేదెవరో తేలిపోతుంది.