చీరాల‌లో కొత్త రాజ‌కీయం.. ఏంటంటే!

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్య‌మైన మలుపులు తిరిగేందుకు రెడీ అవుతున్నాయా ? ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఉన్న నాయ‌కులు త్వ‌ర‌లోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం చీరాల‌లో ఎక్క‌డ చూసినా.. వైసీపీ నేత‌లే క‌నిపిస్తున్నారు. మంది బ‌లం ఎక్కువ‌గానే ఉంది. అయితే.. ఈ మంది బ‌లమే ఇప్పుడు వైసీపీలో ఆధిప‌త్య పోరుకు దారి తీసింది. ప్ర‌ధానంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం త‌న దూకుడు కార‌ణంగా.. వైసీపీలో గ్రూపుల గోల మామూలుగా లేద‌నే వ్యాఖ్య‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. చీరాల వైసీపీలో ఎమ్మెల్యే క‌ర‌ణం, మాజీ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత‌, మాజీ మంత్రి పాలేటి రామారావు ఇలా చాలా మంది పేద్ద నేత‌లే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎప్పుడు అయితే వ‌ల‌స నేత‌లు వ‌చ్చారో అప్ప‌టి నుంచి ఇక్క‌డ వైసీపీ రాజ‌కీయం నాశ‌నం అయిపోయింది.

ఇక క‌ర‌ణం త‌నదే ఆధిపత్యం ఉండాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కార‌ణంగా.. త‌న సొంత మ‌నిషిగా ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి.. సీనియ‌ర్ నాయ‌కుడు పాలేటి రామారావు కూడా ఇప్పుడు ఎగైనెస్ట్ అయిపోయారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీలో ఉండ‌డం క‌న్నా.. బ‌య‌ట‌కు పోవ‌డ‌మే మంచిద‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి పాలేటి రామారావు.. వివాద ర‌హితుడు.. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని టీడీపీలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు.

అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు క‌రణం వైఖ‌రి కార‌ణంగా తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి క‌ర‌ణం ఎక్క‌డుంటే.. పాలేటి అక్క‌డ ఉండేవార‌నే కామెంట్లు వినిపించేవి. కానీ, ఇప్పుడు అదే క‌ర‌ణం.. పాలేటికి పొగ పెడుతున్నారు. దీంతో ఆయ‌న విసుగు చెంది.. త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు చీరాల రాజ‌కీయ వ‌ర్గాల్లో బాహాటంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం టీడీపీకి నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా.. ఉంది. అది కూడా పాలేటి వంటి నాయ‌కులు వ‌స్తే.. చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకోవ‌డం కూడా ఖాయం.

సో.. ఇప్పుడు పాలేటి క‌నుక టీడీపీ వైపు వ‌స్తే.. ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దిశ‌గానే పాలేటి ఇప్పుడు ఆలోచ‌న చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీలోకి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే జ‌రిగితే.. చీరాల రాజ‌కీయంలో పెను మార్పులు ఖాయ‌మ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పాలేటికి టీడీపీ టికెట్ ఇస్తే.. ఆ పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి చీరాల రాజ‌కీయం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.