కరోనాపై అల్లు అరవింద్ మాట.. అందరూ వినాలి

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఇటీవలే కరోనా బారిన పడ్డట్లు సమాచారం బయటికి రావాల్సిందే. ఐతే ఆయన రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా బారిన పడ్డారంటూ మీడియాలో వార్తలు రావడం చాలామందికి ఆగ్రహం తెప్పించింది. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ప్రయోజనమే లేదన్నట్లుగా ఈ వార్తను రిపోర్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతతో అల్లు అరవింద్ మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. తనకు కరోనా సోకడం వాస్తవమే అని నిర్ధారించిన ఆయన.. వ్యాక్సిన్‌కు, కరోనాకు సంబంధం లేదంటూ వివరించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో అరవింద్ చెప్పిన కీలకమైన విషయాలు జనాలకు చాలా అత్యావశ్యకమైనవనడంలో సందేహం లేదు.

తాను కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నాక ఇంకో ఇద్దరు మిత్రులతో కలిసి వేరే ఊరికి వెళ్లి వచ్చానని.. అందులో ఒక మిత్రుడు వ్యాక్సిన్ వేయించుకున్నాడని, మరికొరు వేయించుకోలేదని.. వ్యాక్సినేషన్ చేయించుకున్న రెండో వ్యక్తికి కరోనా సోకి ఆసుపత్రి పాలై, పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని అరవింద్ వెల్లడించారు. తర్వాత తనకు కూడా కరోనా సోకిందని, ఐతే తాను రెండుసార్లు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తనపై కరోనా ప్రభావం పెద్దగా లేదని.. చాలా మామూలుగానే ఉన్నానని.. కాబట్టే ఇలా వీడియో కూడా రిలీజ్ చేయగలుగుతున్నానని అరవింద్ చెప్పారు.

వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదనేమీ లేదని.. కానీ వ్యాక్సినేషన్ చేయించుకున్న వారిపై వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, అందుకు తానే నిదర్శనమని.. కాబట్టి వ్యాక్సిన్ మీద ఏ సందేహాలూ పెట్టుకోకుండా అందరూ టీకా వేయించుకోవాలని అరవింద్ సూచించారు.