ఏఎన్నార్ 39 ఏళ్ల నాటి సినిమా.. ఇప్పుడు రిలీజ‌ట‌


కొన్ని సినిమాలు అనివార్య ప‌రిస్థితుల్లో ఆగిపోయి కొన్నేళ్ల త‌ర్వాత రిలీజ‌వుతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇలా ఆగిపోయిన సినిమాలు అందులోని న‌టీన‌టుల్లో లేదా టెక్నీషియ‌న్ల‌లో ఎవ‌రైనా చ‌నిపోయాక రిలీజ‌వ‌డం కూడా అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతుంటుంది. కానీ ఒక సినిమా మొద‌లుపెట్టిన 39 ఏళ్ల‌కు రిలీజ్ కావ‌డం.. అందులో ప్ర‌ధాన పాత్ర పోషించిన నటుడు, ద‌ర్శ‌కుడు చాలా ఏళ్ల కింద‌టే చ‌నిపోవ‌డం మాత్రం అరుదైన విష‌య‌మే. ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతోంది.

టాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన పాత్ర పోషించిన ప్ర‌తిబింబాలు అనే సినిమా.. అది మొద‌లైన 39 ఏళ్ల‌కు విడుద‌ల కాబోతోంద‌ట‌. 1982 సెప్టెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు చిత్రాన్ని ప్రారంభించారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల చిత్ర నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు ఆగిపోయిన ఈ సినిమాను 39 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు దాని నిర్మాత జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ‌మూర్తి. ఈ చిత్రాన్ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు రూపొందించ‌డం విశేషం. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి అయిన అప్ప‌టి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావుతో పాటు ఇంకొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్‌ చేశారు.

ప్ర‌కాష్ రావు ఎప్పుడో కాలం చేయ‌గా.. ఏఎన్నార్ సైతం ద‌శాబ్దం కింద‌ట చ‌నిపోయారు. ఈ సినిమాకు ప‌ని చేసిన మ‌రికొంత‌మంది కూడా ఇప్పుడు లేరు. ఐతే ఇంత గ్యాప్ వ‌చ్చాక ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న విడుదల చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. థియేట‌ర్ల‌లో అయితే ఈ సినిమా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌ ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌చ్చు. బ‌హుశా ఏదైనా ఓటీటీలో రిలీజ్ చేసి మ‌మ అనిపిస్తారేమో.