కేంద్ర బలగాల గుప్పిట్లో నందిగ్రామ్

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అత్యంత ఎలక్ట్రిఫైయింగ్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నందిగ్రామ్ ఒక్కటే. ఇక్కడే మమతాబెనర్జీ పోటీచేస్తున్నారు. బీజేపీ తురుపుముక్క సుబేందు అధికారిది నందిగ్రామ్ సొంత నియోజకవర్గం. చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించారు. ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ లో పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు.

అసలే మండిపోతున్న మమతకు సుబేందుకు విసిరిన సవాలు పుండుమీద కారం రాసినట్లయ్యింది. దాంతో చాలాకాలంగా పోటీచేస్తున్న భరత్ పూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో పోటీకి దిగారు. నందిగ్రామ్ లో నామినేషన్ వేసి బహిరంగసభ నిర్వహించాల్సిన రోజే మమత కాలికి గాయమైంది. అప్పటినుండి నందిగ్రామ్ వైపే యావత్ దేశం చూస్తోంది. మమత-సుబేందులో ఎవరు గెలిచినా బెంగాల్ చరిత్ర మొత్తం మారిపోవటం ఖాయం.

ఒకవేళ నందిగ్రామ్ లో మమత ఓడిపోతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికే అవకాశాలు ఎక్కువున్నాయి. దాంతో నరేంద్రమోడి+అమిత్ షా లకు అపూర్వమైన విజయం దక్కినట్లే. ఇదే సమయంలో సుబేందు గనుక ఓడిపోతే మోడికి పెద్ద షాకన్నట్లే. ఎందుకంటే సుబేందే గెలవలేకపోతే ఇక బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవనే లెక్క. సుబేందు కుటుంబానికి నందిగ్రామ్ చుట్టుపక్కలున్న దాదాపు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఇంతటి సుబేందే ఓడిపోతే బీజేపీకి దిక్కెవరు ?

అసలు సుబేందు కుటుంబాన్ని చూసుకునే నరేంద్రమోడి, అమిత్ బెంగాల్లో మమతపై రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే తన గెలుపు కోసం మమత నాలుగురోజులు నందిగ్రామ్ లోనే క్యాంపేశారు. రెండోదశ ఎన్నికలో నందిగ్రామ్ కూడా ఉండటంతో పోలింగ్ అయ్యేవరకు మమత నియోజకవర్గంలోనే క్యాంపువేశారు. ఇదే సమయంలో సుబేందు కూడా అక్కడే ఉండటంతో మొత్తం టెన్షన్ టెన్షన్ గా తయారైంది.

మమత క్యాంపు వేశారని యావత్ రాష్ట్ర పోలీసులు నందిగ్రామ్ లోనే ఉన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేక సుబేందు కోసమని కేంద్రప్రభుత్వం కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. దాంతో ఒకవైపు కేంద్రబలగాలు మరోవైపు రాష్ట్ర పోలీసులు నియోజకవర్గం మొత్తం దిగేశారు. మొత్తానికి ఒక్క నియోజకవర్గం బెంగాల్ చరిత్రనే మార్చేయబోతోంది. అందుకనే నందిగ్రామ్ లో ఎప్పుడేమవుతుందో అర్ధంకాక జనాల్లో ఫుల్లుగా టెన్షన్ పెరిగిపోతోంది.