తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ల్లే అంద‌రికీ హోప్-కార్తి

క‌రోన-లాక్ డౌన్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా సినీ పరిశ్ర‌మ‌లు ఎలా అల్లాడిపోయాయో తెలిసిందే. ఈ దెబ్బ నుంచి బాలీవుడ్ ఇప్ప‌టికీ కోలుకోలేక‌పోతోంది. మిగ‌తా ఇండ‌స్ట్రీలు కూడా న‌త్త‌న‌డ‌క‌నే న‌డుస్తున్నాయి. కానీ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మాత్రం ఈ దెబ్బ నుంచి త్వ‌ర‌గానే తేరుకుంది. ఈ విరామం త‌ర్వాత థియేట‌ర్లు పునఃప్రారంభం అయిన కొన్ని రోజుల‌కే అవి క‌ళ‌క‌ళ‌లాడాయి.

50 శాతం ఆక్యుపెన్సీతోనే మ‌న సినిమాల‌కు భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగాక ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డింది. దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా టాలీవుడ్ మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇది చూసి మిగ‌తా ఇండ‌స్ట్రీల వాళ్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌న ఇండ‌స్ట్రీని, ప్రేక్ష‌కుల‌ను పొగిడేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో కార్తి సైతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ, ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

త‌న కొత్త చిత్రం సుల్తాన్ ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కార్తి.. దేశ‌వ్యాప్తంగా అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కూ ఒక హోప్ ఇచ్చిన ఇండ‌స్ట్రీ టాలీవుడ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తెలుగు సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయ‌ని.. అది చూసి త‌మిళ ఇండ‌స్ట్రీ కూడా ఎంతో సంతోషించింద‌ని కార్తి తెలిపాడు. త‌న సినిమా రిలీజ్ చేయాల‌నుకున్న‌పుడు కూడా.. తెలుగులో మంచి సినిమాల‌ను ఆద‌రిస్తున్నార‌న్న ధీమాతో విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ట్లు చెప్పాడు కార్తి.

ఇక ఊపిరి సినిమాలో త‌న‌తో క‌లిసి న‌టించిన నాగార్జున‌తో ఇప్పుడు బాక్పాఫీస్ పోటీకి దిగ‌డంపై కార్తి మాట్లాడుతూ.. దుర‌దృష్ట వ‌శాత్తూ, మ‌రో అవ‌కాశం లేక వైల్డ్ డాగ్‌కు పోటీగా త‌న సినిమాను రిలీజ్ చేయాల్సి వ‌స్తోంద‌న్నాడు. నాగార్జున త‌న సొంత కుటుంబ స‌భ్యుడిలాగే అని, ఆయ‌న్ని సోద‌రుడిగా భావిస్తాన‌ని.. వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పెద్ద మ‌న‌సుతో ఆయ‌న త‌న సినిమా కూడా బాగా ఆడాల‌ని కోరుకున్నాడ‌ని.. ఇందుకు ఆయ‌న్ని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి థ్యాంక్స్ చెబుతాన‌ని.. వైల్డ్ డాగ్ కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాన‌ని కార్తి అన్నాడు.