తిరుప‌తి ప్ర‌చారానికి మోడీ.. బీజేపీ కొత్త పాచిక‌

Narendra Modi

వ‌చ్చే నెల 17న జ‌ర‌గ‌నున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ నాయ‌కులు ఆదిశ‌గా త‌మ వ్యూహాల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. ఇటీవ‌ల ముగిసిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో.. బీజేపీ చావుదెబ్బ‌తింది. కార‌ణాలు ఏవైనా .. కూడా బీజేపీ ఎక్క‌డా నిల‌దొక్కుకోలేక పోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌ట్టుబ‌ట్టి.. మిత్ర‌పక్షం జ‌‌న‌సేన‌ను కూడా త‌ప్పించి.. తాము ద‌క్కించుకున్న టికెట్‌ను గెలిచి తీర‌క‌పోతే.. మిత్ర ప‌క్షం ముందు చుల‌క‌న కావ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల్లోనూ చుల‌కన అవుతామ‌ని బీజేపీ నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తిరుప‌తిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో లోక‌ల్ బీజేపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేక పోవ‌డం, దీనికి స్థానిక నేత‌లు ప్ర‌య‌త్నించ‌లేక పోవ‌డం. అదేవిధంగా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించ‌డం.. దీనికి కూడా నాయ‌కులు అడ్డు చెప్ప‌క‌పోవ‌డం .. వంటి ప‌రిణామాల‌తో పాటు దేవాల‌యాల‌పై జ‌రిగిన దాడుల‌ను కూడా బీజేపీ నేత‌లు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన‌లేద‌నే వాద‌న ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు తామే ప్ర‌చారానికి వెళ్లినా.. ఫ‌లితం అంతంత మాత్రంగానే ఉంటుంద‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు భావిస్తున్నారు.

బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపామ‌నే భావ‌న త‌ప్ప‌.. ప్ర‌చారం విష‌యం వ‌చ్చే స‌రికి మాత్రం ఒకింత జంకుతున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద‌త‌ల‌కాయ్ ఏదైనా ప్ర‌చారానికి వ‌స్తే.. త‌ప్ప‌.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని సూత్ర ప్రాయంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల్లో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ప్ర‌ధాని మోడీ వంటివారిని రంగంలోకి దింపాల‌ని.. హోదా విష‌యంలోను, ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌జెప్ప‌డం లేదా.. ఎందుకు అలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారో.. వివ‌రించ‌డం ద్వారా ప్ర‌స్తుతం ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించి తిరుప‌తిని త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

తాము ఆయా విష‌యాల‌పై ప్ర‌జ‌లకు ఎంత న‌చ్చ‌జెప్పినా ఫ‌లితం ఉండ‌ద‌ని ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన రాష్ట్ర నాయ‌కులు మోడీ, షాల వంటి బ‌ల‌మైన నేత‌ల‌ను ఇక్క‌డ ప్ర‌చారానికి తీసుకువ‌చ్చి.. వివ‌రిస్తే.. మంచిద‌ని భావిస్తున్నారు. ఇదే స‌మయంలో వారు క‌నుక వ‌స్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని.. తామే రంగంలోకి దిగితే.. ప‌వ‌న్ వ‌చ్చే విష‌యం సందేహ‌మేన‌ని కూడా వారు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో మోడీని ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ప్ర‌స్తుతం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో మోడీ వ‌స్తారా? అందునా.. ఒకే ఒక్క పార్ల‌మెంటు స్థానం అది కూడా ఉప ఎన్నిక కావ‌డంతో మోడీ వ‌స్తారా? అనేది సందేహ‌మే!!