బీజేపీతో చెడిందా? జ‌గ‌న్ పాలిటిక్స్‌పై జోరందుకున్న విశ్లేష‌ణ‌లు!

రాజ‌కీయాల్లో అంత‌ర్గ‌త.. లోపాయికారీ ఒప్పందాలు.. వంటివి కామ‌న్‌. అయితే.. ఇవి ఎన్నాళ్లు ఉంటాయి? ఎంత సేపు ‌నిలుస్తాయ‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రికి స్ట్రాట‌జీ వారిది. ఎవ‌రి రాజ‌కీయ స‌మ‌రం వారిది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. అధికార పార్టీ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు విధేయుడి గానే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు ముందు 25 మంది ఎంపీల‌ను ఇవ్వండి.. హోదాను సాధిస్తాన‌న్న ఆయ‌న 22 మంది ఎంపీల‌ను ఇచ్చినా.. చేతులు ఎత్తేశారు. అంటే.. బీజేపీ బాట‌లోకి దాదాపు వెళ్లిపోయారు. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. రాజ‌కీయంగా జ‌గ‌న్ త‌మ‌కు ఏ విధంగా వినియోగంలోకి వ‌స్తాడు అనే వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే చేసి చేయ‌న‌ట్టు.. చూసీచూడ‌న‌ట్టు..కేంద్రం జ‌గ‌న్‌పై ప్రేమ చూపిస్తోంద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. తెర‌వెనుక అన్నీ తాము అనుకూలంగా చేసేస్తే… రేపు జ‌గ‌న్ మ‌రింత బ‌ల‌ప‌డిపోతే..!? అనేది బీజేపీ సందేహం. అందుకే ఎక్క‌డ నొక్కాలో.. అక్క‌డ నొక్కుతోంది. తాజాగా మూడు కీల‌క అంశాల్లో జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఒక‌టి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని .. మ‌రోసారి కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఇది జ‌గ‌న్‌కు తీవ్ర సంక‌ట స్థితిని తీసుకువ‌చ్చింది. మ‌రోవైపు.. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మోట్ అవ్వాల్సిన సుప్రీం సీనియ‌ర్ న్యాయ‌మూర్తి, మ‌న తెలుగువారు.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు వ్య‌తిరేకంగా లేఖ రాయ‌డం.

దీనిని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బాబ్డే తోసిపుచ్చారు. అంతేకాదు..త‌న త‌దుప‌రి సీజేగా ఎన్వీ ర‌మ‌ణ‌ను సిఫార‌సు చేశారు.. ఇది కూడా జ‌గ‌న్ కు తీవ్ర శ‌రాఘాత‌మే. మ‌రోవైపు 2017లో విశాఖ విమానా శ్ర‌యంలో త‌న‌పై దాడి జ‌రిగింద‌న్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫిర్యాదును కూడా పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం త‌ప్పుల త‌డ‌క‌గా పేర్కొంది. అంటే.. విజ‌య‌సాయి.. త‌ప్పుడు ఫిర్యాదు ఇచ్చార‌నే విష‌యం స్ప‌ష్ట మైంది. సో.. ఇవ‌న్నీ కూడా జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బ‌లే. ఇక‌, విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని కూడా కేంద్రం స్ప‌ష్టం చేసేసింది. ఈ మొత్తం ప‌రిణామాలు జ‌గ‌న్‌కు సంక‌టంగా మారాయి. సో.. ఆయ‌న‌కు బీజేపీ నుంచి శ‌రాఘాతాలే ఎదుర‌య్యాయి.

ఇక‌, ఇప్పుడు వ‌చ్చే నెల‌లో సుప్రీం కోర్టు ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. బాధ్య‌త‌లు తీసుకోనున్నారు.. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ పై ఉన్న బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కానీ… విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఎవ‌రైనా కోర్టును ఆశ్ర‌యిస్తే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి? అనేది కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ బ‌లోపేతం అవుతున్న తీరు.. ఏపీలో బీజేపీ ఎద‌గాల‌నే ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతున్న‌ట్టుగానేఉంది. సో.. ఇప్పుడు చెక్ పెట్టుకుంటూ.. పోయి.. అంతిమంగా బెయిల్ ర‌ద్దు చేయిస్తే.. బీజేపీ ఆ వ్యాక్యూమ్‌ను అందిపుచ్చుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని క‌మ‌ల నాథులు ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే… ఏపీ ప్ర‌జ‌ల కోరిక‌లు తీర్చ‌కుండా.. బీజేపీకి ఇక్క‌డ ప‌ట్టం కట్ట‌డం క‌ష్టం. సో.. ఇలాంటి ప‌రిస్థితి ఏదైనా వ‌స్తే.. టీడీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.