సమీక్ష : రంగ్ దే

3/5

2 Hr 10 Mins   |   Family   |   26-03-2021


Cast - Nithiin, Keerthy Suresh, Naresh, Brahmaji

Director - Venky Atluri

Producer - Suryadevara Naga Vamsi

Banner - Sithara Entertainments

Music - Devi Sri Prasad

యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, రొమాటిక్, ఫన్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు వస్తూనే వుంటాయి. కానీ యూత్ ఫుల్ ఎమోషనల్ స్టోరీలు తక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే సినిమాలో ఎమోషన్ కంటెంట్ ను, కమర్షియల్ టచ్ కోసం అదనపు హంగులను మిక్స్ చేసి మెప్పించడం అంత సులువు కాదు. అయితే ఈ మధ్య దర్శకులు కాస్త గట్టిగా అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. జెర్సీ, మజిలీ, నిన్నుకోరి ఇలా కొన్ని సినిమాలు వచ్చి శహభాష్ అనిపించుకున్నాయి. రంగ్ దే కూడా అలాంటి సినిమానే.

రంగ్ దే సినిమా ఫ్లాట్ కొత్తది కాదు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటూనే పెరిగిన అమ్మాయి (కీర్తి) అబ్బాయి (నితిన్) ఎవరికి వారు వ్యక్తం చేయకుండానే ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ ఏ తీరానికి చేరింది అన్నది కథ. గతంలో వచ్చిన నువ్వేకావాలి లాంటి సినిమా అని హీరో నితిన్ ముందే చెప్పేసాడు. కానీ లైన్ పాతగా వున్న చేసిన చిన్న చిన్న మార్పులు, ఇచ్చిన ట్రీట్ మెంట్ వేరు.

ఇంతకీ అలా తయారైన ఈ రంగ్ దే కథేంటీ అంటే, పక్క పక్క ఇళ్లలో వుంటూ చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు అర్జున్-అను. కానీ అను అంటే ఇరిటేట్ గా ఫీల్ అవుతుంటాడు అర్జున్. కానీ అర్జున్ అంటే పూర్తి ఇష్టంతో వుంటుంది అను. ఈ చిరాకు, ప్రేమ స్టార్ట్ టు ఎండ్ అలాగే వుంటాయి. చివరకు ఎలా సిట్యువేషన్ ఎలా మారింది అన్నది సినిమా.

గతంలో వచ్చిన సినిమాలకు రంగ్ దే కు ఇదే ప్రధానమైన తేడా. ఓ అమ్మాయి మీద స్టార్ టు ఎండ్ చిరాకుతో వుండడం లైన్ అనుకుంటే అదే లైన్ లోంచి ఇటు ఫన్ అటు ఎమోషన్ ను పండించానికి ట్రయ్ చేయడం అన్నది రంగ్ దే స్పెషల్. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ఫీట్ ను ఫెర్ ఫెక్ట్ గా, చాలా వరకు చేసాడని చెప్పుకోవాలి. సినిమా తొలిసగం మరీ అద్భుతంగా ఏమీ వుండదు. కానీ బాలేదు అనిపించుకోదు. వారానికి ముఫై మూడు కామెడీ షో లు టీవీల్లో వస్తున్న రోజుల్లో ఫన్ పండించడం అంత వీజీ కాదు. అందుకే తొలిసగం ఫన్ అంత కిక్ ఇవ్వదు. కానీ బోర్ కొట్టదు. కుర్చీలో ఇబ్బందిగా కదలనివ్వదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే బ్రహ్మాజీ ఎపిసోడ్ కాస్త జోష్ ఇస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, ఫస్ట్ హాఫ్ ను శాటిస్ ఫాక్షన్ గా ముగించారనిపిస్తుంది.

సినిమా సెకండాఫ్ లోకి ఎంటర్ అవుతూనే జోష్ కొంత వరకు కిక్ స్టార్ట్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఎంటరై కాస్త ఫన్ అన్నట్లు యాడ్ చేసాడు. అక్కడి నుంచి చివరి వరకు ప్రిడిక్టబుల్ నెరేషన్ నే అయినా, ఇంట్రస్టింగ్ గానే పిక్చరైజ్ చేసాడు దర్శకుడు. సినిమా చివరి అరగంట పూర్తిగా ఎమోషన్ కంటెంట్ పై గ్రిప్పింగ్ గా నడిపి, ఎండ్ చేయగలిగాడు. మరీ హెవీ డైలాగుల జోలికి పోలేదు. అలా అని డెప్త్ ను మాటల్లోకి తీసుకురావడంలో ఫెయిల్ కాలేదు. మధ్య మధ్యలో వెన్నెల కిషోర్ ను వాడుకుంటూ ఫన్ ను లైట్ గా టచ్ చేయడం అన్నది మరిచిపోలేదు. కానీ సినిమా మొత్తానికి ఆ ఫన్ ఏమేరకు సరిపోతుంది అన్నది క్వశ్చను.

రంగ్ దే కు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి. అందులో కీలకమైనది సినిమాకు తగినట్లు కలర్ ఫుల్ పిక్చరైజేషన్. పెట్టిన ఖర్చు. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. రంగ్ దే అన్నందుకు ఆద్యంతం రంగుల మయమే. తరువాత పాటలు, సినిమాలో మొదటి పాట వదిలేస్తే మిగిలినవన్నీ పక్కాగా సిట్యువేషనల్ గా వచ్చేవే. దేవీశ్రీప్రసాద్ పాటలు బానే చేసాడనిపించుకుంటాడు. అదే టైమ్ లో బిజిఎమ్ విషయంలో కూడా మార్కులు సంపాదించేస్తాడు. నిజానికి టెక్నికల్ టీమ్ లో తక్కువ మార్కులు పడేది డైరక్టర్ రాసుకున్న సంభాషణలకే. కానీ అదే వెంకీ డైరక్టర్ గా మాత్రం సక్సెస్ నే. నిజానికి ఇలాంటి సినిమాకు ఇంకా బలమైన సంభాషణలు వుండాలి. అలాగే దర్శకుడు వెంకీది ఫన్ జోనర్ కాదు. అప్పటికీ చాలా వరకు ప్రయత్నించాడు. కానీ అది చాలదు.

నితిన్-కీర్తి పోటీ పడుతూ చేసారు. మరీ డైటింగ్ ఎక్కువ కావడం వల్ల కావచ్చు అక్కడక్కడ కీర్తి ఫేస్ మరీ చిన్నగా, చిక్కిపోయినట్లు కనిపించింది. కానీ పెర్ ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బ్రహ్మాజీ కొద్ది సేపు, వెన్నెల కిషోర్ ఎక్కువ సేపు సినిమాను ఆదుకున్నారు. సుహాస్, గోమటం మాత్రం జస్ట్ ఓకె.

మొత్తం మీద కొత్త కథ కాకపోయినా, కొత్తగా చెప్పడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయిన సినిమా రంగ్ దే. ఫస్ట్ హాఫ్ ఫన్ ను మరింత పెంచి, సెకండాఫ్ ఫన్ ను మరికాస్త సానబట్టి వుంటే ఇంకా మంచి రేంజ్ కు వెళ్లగలిగే స్టామినా వున్న సినిమా రంగ్ దే.

ప్లస్ పాయింట్లు

ప్రొడక్షన్ వాల్యూస్

పాటలు

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు

ఫస్ట్ హాఫ్ లో ఫన్

ఫినిషింగ్ టచ్: రంగులే..రంగులే

Rating: 3/5