మెగా ఫ్యామిలీ ఓన్ చేసుకోలా..


టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలు మరే కుటుంబం నుంచీ రాలేదన్నది వాస్తవం. మెగా క్రికెట్ టీం అంటూ ఆ కుటుంబంలో ఎక్కువమంది హీరోలుండటంపై కౌంటర్లు వేసే వాళ్లూ లేకపోలేదు. కానీ ఈ కుటుంబం నుంచి వచ్చే హీరోలకు లాంచింగ్ పరంగా చిరు అండ్ కో నుంచి సపోర్ట్ ఉంటుంది తప్ప.. అదే పనిగా పుష్ చేయడం ఉండదు. ఎవరి ప్రతిభ, కష్టం మీద వాళ్లు కెరీర్లను నడిపించాల్సిందే అన్నట్లుగా ఉంటుంది ఆ కుటుంబ పెద్దల వ్యవహారం. బలవంతంగా ప్రేక్షకుల మీదికి ఎవరినీ రుద్దాలన్న ప్రయత్నం కనిపించదు.

అల్లు శిరీష్ నిలదొక్కుకోవడానికి కష్టపడుతుంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ మీద అతడి తండ్రి సురేష్ పోసినట్లు అల్లు అరవింద్ ఏమీ అతడిపై పదుల కోట్లు పోసేయలేదు. ఇక్కడే మెగా ఫ్యామిలీ ప్రత్యేకత కనిపిస్తుంది. టాలెంటును బట్టే ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పవన్ తేజ్ కొణిదెల అనే కొత్త హీరో వస్తున్నాడు.

కొణిదెల అనే ఇంటి పేరును బట్టే ఇతను చిరు కుటుంబానికి దగ్గరి బంధువనే విషయం అర్థమవుతుంది. ఈ కుర్రాడు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు. తాను మెగా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి పవన్ తేజ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు కానీ.. దాని వల్ల పెద్దగా ఫలితం ఉండట్లేదు. అతడి సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే పెద్దగా విషయం ఉన్నట్లు కనిపించలేదు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఇమిటేట్ చేయడం.. పాత సినిమాల్లో చిరంజీవిలా ఉన్నావంటూ డైలాగ్ పెట్టించుకోవడం లాంటివి చూస్తే టూమచ్‌గానే అనిపించాయి జనాలకు. ఇక ఈ కుర్రాడి లుక్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సినిమాను ప్రమోట్ చేస్తే తమ బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుందనో ఏమో మెగా ఫ్యామిలీ నుంచి ఇతడికి ఎలాంటి సపోర్ట్ కనిపించలేదు.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో.. పవన్ తేజ్ పవన్ కళ్యాణ్‌ తనకు బాబాయి అని చెబుతూ, ధైర్యం కోసం ఆయన ఇచ్చిన షర్టు వేసుకున్నా అంటూ వ్యాఖ్యానించేసరికి జనాలకు అతిగా అనిపించింది. దీని మీద సోషల్ మీడియాలో కౌంటర్లు, మీమ్స్ కూడా పడ్డాయి. ఈ సంగతలా వదిలేస్తే శుక్రవారం చాలా తక్కువ థియేటర్లలో నామమాత్రంగా విడుదలవుతోంది. మరి కొణిదెల బ్రాండుతో వస్తున్న ఈ హీరోను ప్రేక్షకులు ఏమేర పట్టించుకుంటారో చూడాలి.