బన్సాలీ సినిమా మరి.. గొడవ లేకుంటే ఎలా?


బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో సంజయ్ లీలా బన్సాలీ ఒకరు. ఆయన తీసే ప్రతి సినిమాలోనూ క్లాసిక్ టచ్ ఉంటుంది. హమ్ దిల్ కే చుకే సనమ్, దేవదాసు, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్.. ఇలా ఆయన్నుంచి గొప్ప గొప్ప సినిమాలే వచ్చాయి. ఐతే బన్సాలీ సినిమాలను వివాదాలు వెంటాడడమూ కొత్త కాదు. మేకింగ్ దశలో ఉండగానే ఆయన సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘పద్మావత్’ గురించి ఎంత రభస జరిగిందో తెలిసిందే.

‘పద్మావతి’ పేరుతో మొదలై, చివరికి అనేక అడ్డంకులను అధిగమించి, సెన్సార్ కటింగ్స్ ఎదుర్కొని, టైటిల్ మార్చుకుని రిలీజ్ కావాల్సిన పరిస్థితి తలెత్తింది ఆ సినిమాకు. ఐతే అంతిమంగా సినిమాకైతే మంచి ఫలితమే వచ్చింది. దీని తర్వాత బన్సాలీ నుంచి వస్తున్న ‘గంగూబాయి కతియావాడీ’కి హైప్ తక్కువగా ఏమీ లేదు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టీజర్ వదిలారు. అది అంచనాల్ని పెంచేసింది.

ఐతే ‘గంగూబాయి’ అంత తేలిగ్గా ఏమీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా ఒకప్పుడు ముంబయిలో బ్రోతల్ హౌస్‌‌లు నడుపుతూ నగరాన్ని ఏలిన గంగూబాయి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆమె మీద గతంలోనే ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి’ పేరుతో ఓ పుస్తకం వచ్చింది. ఆ బుక్‌ ఆధారంగానే బన్సాలీ ఈ సినిమా తీశాడు. ఐతే గంగూబాయి దత్త పుత్రుడైన రావ్ జీ షా అనే వ్యక్తి ఈ సినిమాకు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కాడు. అతను ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి’ పుస్తకం మీదా అభ్యంతరం వ్యక్తం చేశాడు. కేసు వేశాడు.

గంగూబాయిని వేశ్యగా, వేశ్యావాటికలు నడిపే డాన్‌గా చూపించడం పట్ల అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీని వల్ల తమ కుటుంబ ప్రతిష్ట దెబ్బ తింటోందని, తమకు సమాజంలో విలువ లేకుండా పోతోందని, తమ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని అతను పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై కోర్టు బన్సాలీ, ఆలియాలకు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. దీంతో సినిమా చిత్రీకరణను ఆపి ఈ కేసు వ్యవహారం తేల్చుకోవాల్సిన స్థితిలో పడ్డాడు బన్సాలీ. ఐతే ఇలాంటి వివాదాలు సినిమా ప్రచారానికి పనికొచ్చేవే అని, ఇలాంటివి బన్సాలీకి కొత్త కాదు కాబట్టి ఈజీగానే డీల్ చేసేస్తాడని అంటున్నారు ఆయన సన్నిహితులు. ‘రాధేశ్యామ్’కు పోటీగా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘గంగూబాయి కతియావాడీ’.