చిన్నమ్మ ఏమి చేస్తున్నదో తెలుసా ?

ఒకవైపు తమిళనాడులో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. మరోవైపు పార్టీలు టికెట్లను ప్రకటించటంలో, మ్యానిఫెస్టోలను రిలీజ్ చేయటంలో చాలా బీజీగా ఉన్నాయి. రాజకీయంగా ఇంతటి బీజీగా ఉన్న కాలంలో చిన్నమ్మ అలియాస్ శశికళ ఇంకెంత బిజీగా ఉండాలి ? రాజకీయల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం ఉండదని మాత్రమే అందరు అనుకుంటున్నారు. అసలు చిన్నమ్మ చేసిన ప్రకటననే చాలామంది నమ్మటం లేదు.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే అసలు శశికళ ఏమి చేస్తున్నారు ? ఇపుడిదే ప్రశ్న చాలామందిని తొలిచేస్తోంది. ఇంతకీ ఆమె ఏమి చేస్తున్నారంటే ప్రశాంతంగా రాష్ట్రంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. దేవాలయాల చుట్టు తిరుగుతు, ప్రత్యేకపూజలు చేస్తున్నారు. అభిషేకాలు, హోమాలతో చాలా బిజీగా టెంపుల్ టూర్లలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఒకవైపు చిన్నమ్మ ఆధ్యాత్మిక చింతనలో గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నా ఆమె మద్దతు మాత్రం తమకే ఉంటుందని అన్నాడీఎంకే, ఏఎంఎంకే అధినేత కమ్ మేనల్లుడు దినకరన్ మాత్రం ఎవరికి వారుగా చెప్పుకుంటున్నారు. ఆమె ఎవరికి మద్దతుగా ప్రచారం చేయకపోయినా డీఎంకేను ఓడించాలనే పిలుపిచ్చారు కాబట్టి ఆమె మద్దతు తమకే ఉంటుందని చెప్పేసుకుంటున్నారు.

లోలోపల ఆమె ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియకపోయినా ఈమధ్యనే చెన్నైలోని అగస్తియర్ దేవాలయాన్ని సందర్శించారు. తాజాగా తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోని తిరువిడైమరుదూరుకు దగ్గరలో మహాలింగస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తిరుచ్చిలోని శ్రీరంగం దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయించుకున్నారు. మరో రెండు రోజుల పాటు తంజావూరులోనే శశికళ ఉండబోతున్నారు. మొత్తానికి ఎన్నికల హీట్ కు దూరంగా ఆధ్యాత్మిక చింతనలో గడిపేస్తున్నారు. మరి ఈ టెంపుల్ టూర్లో ఎంతకాలం ఉంటారో చూడాలి.