తాడిప‌త్రి నెగ్గారు.. జేసీ గేర్ మార్చారు!

రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన మునిసిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌య దుందుభి మోగించింది. అసలు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నా.. ఫ‌లితాల్లో మాత్రం ఆ త‌ర‌హా ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే.. ఇంత‌గా విజ‌యం సాధించినా అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిపాలిటీ మా త్రం వైసీపీకి ద‌క్క‌లేదు. ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి దూకుడు పెంచారు .. తాజాగా ఆయ‌నే చైర్మ‌న్‌గా ఏక‌గ్రీవం అయ్యారు. మొత్తం స్థానాల్లో జేసీ వ‌ర్గం 20 వార్డుల‌ను ద‌క్కించుకుం ది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. రాష్ట్రం మొత్తం వైసీపీ హ‌వా ఉన్నా… తాడిప‌త్రిని మాత్రం టీడీపీ త‌న ఖాతాలో వేసుకోవ‌డం.. సంచ‌ల‌న‌మే. అయితే.. ఈ సంతోషాన్ని కొద్ది సేపు కూడా నిల‌వ‌కుండా చేసేశారు… జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఎప్పుడూ.. సంచ‌ల‌న కామెంట్లు చేసే ఆయ‌న‌.. ఇప్పుడు అంత‌క‌న్నా ఎక్కువ‌గా సెన్సేష‌న‌ల్ కామెంట్లు చేశారు. ఇక్క‌డ ట‌గ్ ఆఫ్ వార్ మాదిరిగా న‌డిచిన నేప‌థ్యంలో తాను చైర్మ‌న్ అవ‌డం అనేది జ‌గ‌న్ నీతిమంత‌మైన, నిజాయితీతో కూడిన రాజ‌కీయాల వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు… తాను త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌తో భేటీ అవుతాన‌ని తెలిపారు.

నేను మా నాన్న చ‌చ్చిపోయినా.. నేను ఏడ‌వ‌లేదు. కానీ.. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి చ‌చ్చిపోతే.. ఏడ్చాను అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి బాస్ అని , ఆయ‌న కింద తాను ప‌నిచేస్తున్నాన‌ని.. ఇది త‌న‌కు గ‌ర్వ కార‌ణ‌మ‌ని జేసీ ప్ర‌క‌టించారు.. ఈ వ్యాఖ్య‌లు టీడీపీలో తీవ్ర సంక‌టంగా మారాయి. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓట‌మి ప‌రాభ‌వం నుంచి కోలుకోలేదు. పోనీ.. గెలిచాం.. నిలిచాం.. అని భావించిన తాడిప‌త్రిలో ఇప్పుడు కీల‌క నేతే చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టి.. మ‌రీ జ‌గ‌న్‌ను.. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తడం నేత‌ల‌కు చిరాకుగా మారింది. ప్ర‌స్తుతం జేసీ ప్ర‌భాక‌ర్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.